ఒకానొక దశలో భారత్‌-చైనా యుద్ధం తప్పింది

సరిహద్దు ఉద్రిక్తతలను గుర్తుచేసుకున్నలెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి

న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌ సరిహద్దుల్లో భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఆ ప్రాంతం నుంచి ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి మాట్లాడుతూ.. కీలక విషయాన్ని వెల్లడించారు. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ఒకానొక దశలో చైనాతో యుద్ధం చేసేంత వరకు భారత్ వెళ్లిందని ఆయన అన్నారు. అయితే పరిస్థితి యుద్ధం వరకు వెళ్లకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించిందని తెలిపారు. గత జులైలో గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య రెడ్ లైన్ గీయాల్సి వచ్చిందని చెప్పారు.

రోజుల వ్యవధిలోనే ఆగస్ట్ 29, 30 మధ్య రాత్రివేళ పాంగ్యాంగ్ సరస్సుకు దక్షిణాన వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన కైలాశ్ రేంజ్ ను భారత్ అధీనంలోకి తీసుకుందని తెలిపారు. ఊహించని ఈ పరిణామంతో చైనా షాకయిందని చెప్పారు. ఆ తర్వాత భారత్ పై ప్రతీకార చర్యలకు చైనా దిగిందని జోషి తెలిపారు. ఆగస్ట్ 31న కైలాశ్ రేంజ్ సమీపంలోకి రావాలని ప్రయత్నించిందని… దీంతో, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగాయని చెప్పారు. మన ట్యాంక్ మన్లు, గన్నర్లు పరిస్థితులను గమనిస్తున్నారని… చైనా యుద్ధ ట్యాంకు సమీపంలోకి రాగానే అప్రమత్తమయ్యారని తెలిపారు.

ఆ సమయంలో ట్రిగ్గర్ నొక్కి యుద్ధాన్ని ప్రారంభించడం చాలా సులువని… ఎందుకంటే ఎలాంటి ఆపరేషన్ అయినా చేపట్టేందుకు తమకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. చైనా బలగాలపై కాల్పులు జరపకుండానే దాన్ని నిలువరించడం చాలా క్లిష్టమైన పని అని… దానికి ఎంతో ధైర్యం కావాలని… మన జవాన్లు ఎంతో ధైర్యంతో యుద్ధం జోలికి వెళ్లకుండానే చైనాను నిలువరించారని చెప్పారు. ఆ సమయంలో భారత్ దాదాపు యుద్ధం అంచుల వరకు వెళ్లిందని అన్నారు.

గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 45 మంది కంటే ఎక్కువగానే చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని జోషి చెప్పారు. భారత్ ను రెచ్చగొట్టి కయ్యానికి కాలు దువ్విన చైనాకు… చెడ్డ పేరు తొచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని అన్నారు. భారత్ చేపట్టిన ఆకస్మిక చర్యలు చైనాను గందరగోళానికి గురి చేశాయని చెప్పారు. భారత జవాన్లు చూపిన ధైర్యసాహసాలు, సహనాలను చూసి దేశం గర్వపడుతోందని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/