30 సెకన్లలోనే కోవిడ్‌ ఫలితం

ప్రత్యేక పరీక్ష విధానాన్ని సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న భారత్, ఇజ్రాయెల్

30 సెకన్లలోనే కోవిడ్‌ ఫలితం
India, Israel join hands to develop rapid testing for Covid-19

న్యూఢిల్లీ: కరోనా పరీక్షల ఫలితం 30 సెకన్లలోనే తెలుసుకునేలా ప్రత్యేక పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసేందుకు భారత్, ఇజ్రాయెల్ చేతులు కలిపాయి. భారత్, ఇజ్రాయెల్ కలిసి నాలుగు వేర్వేరు సాంకేతిక పద్ధతులను పరీక్షిస్తున్నాయి. వైరస్‌ను గుర్తించేందుకు ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు నాలుగు పద్ధతులను కొనుగొన్నారు. ప్రస్తుతం ఈ పద్ధతులను ఢిల్లీలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రి (ఆర్ఎంఎల్)లో పరీక్షిస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇకపై 30 సెకన్లలోనే కరోనా ఫలితాన్ని తెలుసుకోవచ్చు. కనుగొన్న నాలుగు పద్ధతుల్లో రెండింటిలో లాలాజల నమూనాలను పరీక్షిస్తారు.

మూడో విధానంలో బాధితుడి స్వరం ఆధారంగా, నాలుగో విధానంలో శ్వాస నమూనాలోకి రేడియో తరంగాలను పంపడం ద్వారా వైరస్ సోకిందీ, లేనిదీ నిర్ధారిస్తారు. ఇది విజయవంతమైతే ఇక కరోనా ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూసే బాధ తప్పుతుంది. అంతేకాదు, బాధితులకు వెంటనే వైద్య చికిత్స అందించే అవకాశం లభిస్తుంది. ఆర్ఎంఎల్‌లో జరుగుతున్న ట్రయల్స్‌ను పరిశీలించేందుకు ఇజ్రాయెల్ రాయబారి రాన్ మల్కా నిన్న ఆసుపత్రిని సందర్శించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/