రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్‌కు భారత్ దూరం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర స‌మావేశం
వీటో అధికారాన్ని ఉప‌యోగించిన ర‌ష్యా

హైదరాబాద్ : రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను పూర్తిస్థాయిలో రష్యా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. కీవ్​లోని సైనిక స్థావరంపై రష్యా బలగాలు దాడి చేశాయి. అయితే వీటిని దీటుగా తిప్పికొట్టినట్లు ఉక్రెయిన్​ సైన్యం వెల్లడించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది. రష్యా దాడిని ఖండిస్తూ భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే మొదటి నుంచి ఉక్రెయిన్‌-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.

కాగా, భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి ముసాయిదాను తిరస్కరించింది. అంతకుముందు ఐరాసలో భారతరాయబారి టీఎస్‌ తిరుమూర్తి మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాల పట్ల భారత్‌ తీవ్ర ఆందోళనకు గురవుతున్నదని చెప్పారు. హింసను తక్షణమే నిలిపివేయడానికి తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/