రెండో రోజూ బీబీసీ ఆఫీసుల్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు

న్యూఢిల్లీః ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో నేడు కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరో వైపు బీబీసీ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ చేసింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐటీశాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచన చేసింది. వ్యక్తిగత ఆదాయం అంశాలపై ఉద్యోగులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా బీబీసీ తన మెయిల్‌లో స్పష్టం చేసింది. ఐటీ అధికారులు సమగ్రమైన రీతిలో సమాధానం ఇవ్వాలని బీబీసీ తన ఉద్యోగులకు తెలిపింది.
రెండో రోజు సోదాల్లో కేవలం ట్యాక్స్ డిపార్టమెంట్‌ను మాత్రమే ఐటీ అధికారులు టార్గెట్ చేయనున్నారు. బీబీసీపై జరుగుతున్న ఐటీ తనిఖీల అంశంపై ఇప్పటి వరకు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. సర్వేలో భాగంగా సీనియర్ మేనేజ్మెంట్‌ను ప్రశ్నించనున్నట్లు ఐటీశాఖ పేర్కొన్నది. పన్ను ఎగవేతలు, ఆదాయ లాభాలను దారి మళ్లించడం లాంటి నేరాలకు బీబీసీ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలోనూ బీబీసీకి నోటిసులు ఇచ్చినా ఆ సంస్థ పట్టించుకోలేదని ఐటీ అధికారులు చెబుతున్నారు.
అయితే ఐటీ అధికారులతో మంగళవారం కొందరు ఉద్యోగులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఎటువంటి వారెంట్ లేకుండా ఎలా తమ సంస్థలోకి ఎంట్రీ అయినట్లు వాళ్లు ప్రశ్నించారు. పన్ను పేరుతో తమ వద్ద ఉన్న సమాచారాన్ని డెస్క్‌టాప్‌ల నుంచి సేకరిస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీపై డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ సంస్థపై దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.