అమెరికన్‌ దిగుమతులపై సుంకాల పెంపు!

india-america
india-america


వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికైనప్పటి నుంచీ భారత్‌పై ద్వేషపూరిత విధానాలనే అనుసరిస్తున్నారు. ఇరాన్‌పై ఆంక్షలు, భారత్‌ అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయరాదని ఆర్డర్లు, భారతదేశాన్ని ప్రాధాన్యత దేశంగా గుర్తింపు రద్దు, ఇలా భారత్‌పై ట్రంప్‌ వ్యతిరేక విధానాలనే అవలంబించారు. తాజాగా భారతదేశం అమెరికన్‌ దిగుమతులలో దాదాపు 29 అధిక విలువ ఉన్న అగ్రికర్చరల్‌, ఇండస్ట్రియల్‌ దిగుమతులపై 50 శాతం వరకూ సుంకాలను పెంచాలని నిర్ణయించింది. ఇది ఈ సంవత్సరం జూన్‌ 16 నుంచి అమల్లోకి వస్తుందని భారతప్రభుత్వం వెల్లడించింది. అమెరికాలో భారత ఎగుమతులపై మితిమీరిన సుంకాలు విధించిన ట్రంప్‌ ప్రభుత్వం చర్యలకు ప్రతీకాంగానే ఈ సుంకాలు విధించినట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

గతంలో అమెరికా ప్రభుత్వం భారత్‌ నుంచి దిగుమతి అయిన స్టీల్‌పై 25 శాతం సుంకాలను, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలను పెంచింది. దాదాపు రూ.235మిలియన్‌ డాలర్ల విలువైన భారతీయ ఉత్పత్తులపై అమెరికా సుంకాలను పెంచింది. ఇది భారతీయ వ్యాపారులకు కోలుకోలేని దెబ్బగా మార్కెట్‌ ఎనలిస్టులు భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం సుంకాలు పెంచిన జాబితా నుంచి 800సిసి మోటార్‌ సైకిళ్లను తొలగించింది. 2017-18 మధ్యకాలంలో భారత్‌ కేవలం 10 మిలియన్ల డాలర్ల విలువైన బైకులను దిగుమతి చేసుకుంది. కాగా మార్కెట్‌ యాక్సెస్‌ సమస్యలపై భారత్‌పై దాడి చేయడానికి ఒక సాధనంగా ఇటువంటి మోటార్‌ సైకిళ్లను తయారుచేసే సంస్థ హార్లేడేవిడ్‌ సన్‌ను ట్రంప్‌ ఉపయోగిస్తూనే ఉన్నారు.

గత వారం ట్రంప్‌ మోడీ నాకు మంచి మిత్రుడే కానీ, హార్లేడేవిడ్‌ సన్‌ బైకులపై అత్యధిక సుంకాలను భారత్‌ వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే భారత్‌కు ఉన్న వాణిజ్య ప్రాధాన్య హోదాను అమెరికా ఉపసంహరించుకుంది. దీనివల్ల పలు ఉత్పత్తుల ఎగుమతులపై సుంకాల రాయితీ మనకు లభించేది. కానీ ఇప్పుడా వెసులుబాటు లేకపోవడం, అమెరికాను ఎదుర్కొనేందుకే మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, అక్రోటులతో సహా 29 ఉత్పత్తులపై ఈ సుంకాల భారం పడనుంది. ప్రభుత్వ ఖజానాకు సుంకాల రూపంలో 21.7కోట్ల డాలర్ల మేర అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. కాగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని కస్టమ్స్‌ శాఖ పేర్కొంది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/