కోపంలో శ్రద్ధాను హత్య చేశాను.. కోర్టులో నేరం అంగీకరించిన ఆఫ్తాబ్‌

in-heat-of-moment-says-aaftab-poonawala-in-court-on-killing-girlfriend

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. క్షణికావేశంలో తాను ఈ మర్డర్ చేశానని నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా కోర్టులో స్వయంగా ఒప్పుకున్నాడు. కస్టడీ ముగియడంతో ఇవాళ ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ను కోర్టులో హాజరుపరచగా… తాను కోపంలో, ఆవేశంలో శ్రద్ధాను హత్య చేసినట్టు అంగీకరించాడు. అయితే ఈ సంఘటన జరిగి చాలా రోజులవుతున్నందున తనకేమీ గుర్తు లేదని చెప్పాడు. అనంతరం అఫ్తాబ్ కు పోలీసు కస్టడీని మరో 4 రోజులు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

శ్రద్ధా వాకర్ హత్య కేసులో ముందుగా అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ విధించారు. అది నేటితో ముగియడంతో అతడిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాకేత్‌ కోర్టు ముందు హాజరుపర్చారు. విచారణ సందర్భంగా ఘర్షణ వాతావరణంతో క్షణికావేశంలో ఆ ఘటన జరిగిందని చెప్పాడు. అనంతరం కేసు దర్యాప్తు కోసం తాను పోలీసులకు సహకరిస్తానన్న అఫ్తాబ్… శ్రద్ధా శరీర భాగాలను విసిరేసిన ప్రాంతాల గురించి కూడా పోలీసులకు చెప్పానన్నాడు. ఈ ఘటన సంబంధించి అన్ని విషయాలు కోర్టుకు వెల్లడిస్తాని స్పష్టం చేశాడు. తాను చెప్పేవన్నీ నిజాలేనని, పోలీసులను తప్పుదోవ పట్టించడం లేదని అఫ్తాబ్ చెప్పాడు. అయితే ఘటన జరిగి నెలలు గడిచినందున చాలా విషయాలు తనకు గుర్తు రావట్లేదని అఫ్తాబ్‌ కోర్టుకు తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఇటీవల ఢిల్లీలో సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ పోలీసులను అనుమానించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు తమకు ఒక్క కారణం కూడా కన్పించట్లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆఫ్తాబ్‌ తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే అతడికి పాలిగ్రాఫ్‌ పరీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీని తర్వాత నార్కో ఎనాలసిస్‌ పరీక్ష కూడా జరపనున్నారు. ఈ రెండు పరీక్షలను నిర్వహించేందుకు నిందితుడు అంగీకరించాడని… పది రోజుల్లో వీటిని పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ముందుగా నేడు అఫ్తాబ్‌కు పాలిగ్రాఫ్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/