ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతమే:ఐఎంఎఫ్‌ వెల్లడి

IMF
IMF

దావోస్‌: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో, ముఖ్యంగా భారత్‌ పెరుగుతున్న సామాజిక అశాంతి, వర్ధమాన మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) కోతలు ప్రకటించింది. 2019లో 2.9 శాతం వున్న ప్రపంచ ఆర్థికాభివృద్ధి 2020లో 3.3 శాతానికి, 2021లో 3.4 శాతం వుంటుందని అంచనా వేసిన ఐఎంఎఫ్‌ ఈ అంచనాలో 0.1 శాతం మేర కోత విధిస్తున్నట్లు తన వార్షిక నివేదికలో ప్రకటించింది. వాణిజ్య విధానాల అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వర్ధమాన ఆర్థిక వ్యవస్థల మార్కెట్లలో వ్యక్తిగత వత్తిడి వంటి అంశాలు ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల అంచనాలలో కీలకమని, ముఖ్యంగా 2019 ద్వితీయార్ధం నుండి వస్తువుల తయారీ, వాణిజ్య రంగాలలో కొనసాగుతున్న అనిశ్చితి ఆధారంగా తాము ఈ అంచనాలను సవరిస్తున్నట్లు ఐఎంఎఫ్‌ వెల్లడించింది. అనేక దేశాలలో నానాటికీ పెరుగుతున్న సామాజిక అశాంతి, కరీబియన్‌ దేశాలలో హరికేన్‌లు, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, తూర్పు ఆఫ్రికాలో వరదలు, దక్షిణాఫ్రికాలో కరువు వంటి వాతావరణ సంబంధిత విపత్తులు ఆర్థికాభివృద్ధికి పెను సవాళ్లుగా మారుతున్నాయని ఐఎంఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

తాజా బిజినెస్‌ వార్తల కోస క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/