భారత్ పై మరోసారి ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

పెట్రోల్ ధరలు తగ్గించడంపై మోడీ సర్కారుకు ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసలు కురిపించారు. మోడీ సర్కారు పెట్రోల్ ధరలు తగ్గించడాన్ని అభినందించారు. రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేయడం వల్లే అది సాధ్యపడిందన్నారు. అదే సమయంలో స్వదేశంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు.

పాకిస్థాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్ పై అక్కడి కరెన్సీ రూపాయిల్లో 30 చొప్పున పెంచింది. ఇంధనంపై సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నుంచి సాయం పొందేందుకు ఇలా చేసింది. దీంతో అసమర్థ, నిస్పృహ ప్రభుత్వమని విమర్శిస్తూ.. రష్యా నుంచి 30 శాతం తక్కువకు చమురు డీల్ చేసుకోలేకపోయిందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. దీనికి భిన్నంగా అమెరికా వ్యూహాత్మక భాగస్వామి అయిన భారత్ .. రష్యా నుంచి చౌక చమురు కొనుగోలు చేసి లీటర్ పై రూ.25 వరకు (పాక్ కరెన్సీలో) తగ్గించిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

‘‘క్వాడ్ కూటమిలో భాగమైన భారత్.. అమెరికా నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, సామాన్యులకు ఉపశమనం కల్పించేందుకు రష్యా నుంచి చౌకకే చమురు కొనుగోలు చేసింది. స్వతంత్ర విదేశాంగ విధానం ద్వారా మన సర్కారు కూడా సాధించాల్సినది ఇదే’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. తక్కువ ధరకు పెట్రోల్ కొనుగోలుపై చర్చల కోసమే తాను లోగడ రష్యాకు వెళ్లినట్టు గుర్తు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించిన సమయంలో ఆ దేశంలో ఇమ్రాన్ ఖాన్ పర్యటించి విమర్శలు కొని తెచ్చుకోవడం తెలిసిందే.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/