జాతీయ అసెంబ్లీకి రాజీనామా : ఇమ్రాన్ ఖాన్‌

త‌న‌తో పాటు త‌న పార్టీ స‌భ్యులూ రాజీనామా చేస్తార‌ని వెల్ల‌డి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ తాజా మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పాక్ జాతీయ అసెంబ్లీ స‌భ్య‌త్వానికి త‌న‌తో పాటు త‌న పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) స‌భ్యులంతా జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేయ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ నూత‌న ప్ర‌ధాని ఎన్నికను బ‌హిష్క‌రించ‌నున్న‌ట్లు పీటీఐ ఎంపీలు కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన మ‌రుక్ష‌ణ‌మే ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామా ప్ర‌క‌ట‌న వెలువడింది. ఈ నిర్ణ‌యంతో ఏ స‌భ‌లో అయితే తాను ప్ర‌ధాని ప‌ద‌విని కోల్పోయారో..అదే స‌భ‌కు ఇమ్రాన్ రాజీనామాను ప్ర‌క‌టిస్తున్న‌ట్టైంది.

కాగా, ఇవాళ జ‌రిగిన పీటీఐ పార్ల‌మెంట‌రీ పార్టీ మీటింగ్‌లో రాజీనామా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. తాము అసెంబ్లీలో కూర్చోవ‌ద్దు అని నిర్ణ‌యించామ‌ని, దేశాన్ని దోచుకున్న‌వారితో క‌లిసి ప‌నిచేయలేమ‌ని ఇమ్రాన్ అన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/