హార్థిక్‌ పాండ్యాకు నేను పెద్ద అభిమానిని

Stephen Fleming
Stephen Fleming

ముంబయి: ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్థిక్‌ పాండ్యాకు తాను పెద్ద అభిమాని అని చెన్నై సూపర్‌కింగ్స్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అన్నాడు. చెన్నైపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన పాండ్యా ముంబయి గెలుపులో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఇప్పుడు అందరూ అతడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. తాజాగా చెన్నై కోచ్‌, న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ…హార్థిక్‌ పాండ్యా మంచి ఆటగాడు. అతడికి నేను పెద్ద అభిమానిని. ప్రస్తుతం అతడు మంచి విశ్వాసంతో ఉన్నాడు. మ్యాచ్‌ ఆఖర్లో అతడేం చేయగలడో అది చేశాడు. మేం ఏం చేయాలనుకున్నామో అది చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కాకపోతే ఈరోజు సరిగ్గా ఆడలేకపోయామని ఫ్లెమింగ్‌ పేర్కొన్నాడు. అలాగే పాండ్యానైపుణ్యం కలిగిన ఆటగాడని…టీమిండియాకి, ముంబయి ఇండియన్స్‌కి అతడో ప్రధాన అస్త్రమని పేర్కొన్నాడు. పాండ్యాను ఔట్‌ చేస్తే మ్యాచ్‌ విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పాడు. అయితే ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మాత్రం అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించాడని, ముఖ్యంగా బౌలింగ్‌లో 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయడం అద్బుతమని కొనియాడాడు. కాగా, ఈమ్యాచ్‌లో తమ జట్టే మంచిగా ఆడిందని చివర్లో మాత్రమే సరిగ్గా ఆడలేదని చెప్పాడు. అలాగే టీ20 మ్యాచ్‌లు నాలుగు గంటల పాటు కాకుండా త్వరగా ముగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చివరిగా హర్భజన్‌ను తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చారు. తాము ఎంపిక చేసిన పదకొండు మందితో సంతృప్తిగా ఉన్నామని, అవసరమైనప్పుడు భజ్జీని తీసుకుందామని ఫ్లెమింగ్‌ తెలిపాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/