కానిస్టేబుల్‌తో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్యాయత్నం

వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎంతోమంది ఆనాధలు అవుతున్నారు. కట్టుకున్న భార్య , భర్త ఉండగానే వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని పచ్చని కాపురాన్ని పాడుచేసుకుంటున్నారు. ప్రతి రోజు వార్తల్లో పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండగా..కృష్ణా జిల్లాలో ఈ తరహా ఘటనే చోటుచేసుకుంది. తన భార్య కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని భర్త ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం హాస్పటల్ లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

వివరాల్లోకి వెళ్తే ..

కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కేశ్యాతండాకు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, అతని భార్య అదే ప్రాంతానికి చెందిన ఓ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త.. భార్యను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమెలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే పురుగుల మందు డబ్బాను కొనుగోలు చేసి.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి.. అక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్‌తో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అలా చెబుతూనే పురుగుల మందు తాగేశాడు. అయితే, ఇది గమనించిన స్థానికులు సదరు వ్యక్తిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ చెపుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు.