మద్రాస్‌ ఐఐటీ మూసివేత

క్యాంపస్ లో 66 మంది స్టూడెంట్స్ కు, ఐదుగురు సిబ్బందికి వైరస్

IIT- Madras

చెన్నై: చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలో కరోనా కలకలం రేగింది. క్యాంపస్ లో 774 మంది విద్యార్థులు ఉండగా, 66 మంది స్టూడెంట్స్ కు, ఐదుగురు సిబ్బందికి వైరస్ సోకింది. ఎవరి ద్వారా వచ్చిందో తెలియదుగానీ, ఒకే రోజులో 32 మంది వైరస్ బారిన పడటం, ఈ కేసుల సంఖ్య మరింతగా పెరగనుందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో, తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ ఐఐటీని మూసి వేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది.

ఐఐటీలోని అన్ని విభాగాలు, లైబ్రరీని వెంటనే మూసివేస్తున్నామని, అధ్యాపకులు, ఇతర సిబ్బంది, పరిశోధకులు, ప్రాజెక్టుల సిబ్బంది ఇంటి నుంచి పని చేయాలని సూచించామని పేర్కొన్నారు. ఇక క్యాంపస్ లో ఉన్న విద్యార్థులు, హాస్టల్ గదుల్లో మాత్రమే ఉండాలని, బయటకు రావద్దని, కరోనా నిబంధనలన్నీ పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించాలని, భౌతికదూరాన్ని పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సర్క్యులర్ ను విడుదల చేసింది. విద్యార్థులు, సిబ్బందిలో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/