బడిగంటలు మోగాలంటే!

కరోనా వేళ ప్రణాళికలు అవసరం

School Children with Masks
School Children with Masks

కరోనా మహమ్మారి సందర్భంగా యావత్‌ ప్రపంచాన్ని సమాజాన్ని అభద్రతకు గురిచేస్తున్న అంశాలు మూడు.

ఒకటి వైద్యరంగం, రెండోది విద్యారంగం కాగా మూడోది ఉపాధి రంగం. మొదటి, చివరి రంగాలు కుంటినడకనో, గుడ్డినడకనో నడపబడుతుంటే పూర్తిగా నిర్వేధ్యానికి గురైంది మాత్రం విద్యా రంగమే! .

కార్పొరేట్‌ విద్యారంగం ఆన్‌లైన్‌ అనే ఓ అసహజ బోధన విధానంతో చిన్నారుల మెదడుపై గాట్లుపెడుతున్నది.

ఈ విధానాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌ ప్రైవేట్‌ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం హైకోర్టును కూడా ఆశ్రయించింది.

హైకోర్టు కూడా ఈ విధానాన్ని అభిశంసించి, ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ సందర్భంగా కుటుంబాల్లో మానసికాందోళన మొదలైంది.

ఉదయం నుంచి సాయంత్రం దాకా బాహ్య సమాజంలోకి వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు ఇంటికే పరిమితం కావడంతో, పిల్లలతో పాటు తల్లి దండ్రులకు, ముఖ్యంగా తల్లికి మానసిక సమస్యలు తీవ్రమ య్యాయి.

తల్లికైతే పనిభారంతోపాటు పిల్లల విద్యాభారం కూడా అనివార్యమైంది.

ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాల్సిన ప్రభు త్వాలు కరోనా మహమ్మారిని అడ్డుపెట్టుకొని విద్యారంగాన్ని కార్పొ రేట్‌ శక్తులకు అప్పచెప్పి తన బాధ్యతల్ని పూర్తిగా విస్మరిస్తున్నది.

కార్పొరేట్‌ పాఠశాలల్ని నియంత్రించలేక ఇటు ప్రత్యామ్నాయ విధా నాన్ని రూపొందించక తల్లిదండ్రులతోపాటుగా విద్యార్థులకు, ఉపా ధ్యాయులకు అనిశ్చిత పరిస్థితిని కలిగిస్తున్నది.

ఈ విషయంగా మేధావులు, విద్యావేత్తలు కూడా మిన్నకుండిపోతున్నారు.

కొందరు ఔత్సాహికులైన విద్యాభిమానులు కొన్ని మధ్యేమార్గాల్ని ప్రస్తావిం చగా, మరికొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోతరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ పద్ధతిలో బోధనను కొనసాగిస్తున్నారు.

పోతే ఇది అందరికి అందుబాటులో లేకపోవడం, అనుకున్న ఫలితాల్ని ఇవ్వనిస్థితి నెలకొన్నది.

ఈ సందర్భంగా ఏం చేస్తే బాగుంటుందనేది ఓ చిక్కుముడి ప్రశ్న? కరోనాను ఎదుర్కోవడానికి మూడు మార్గా ల్ని ఆచరిస్తున్నాం. ఒకటి మాస్కుల్ని ధరించడం, రెండు సామా జిక దూరం పాటించడం కాగా మూడోది పరిశుభ్రతను పాటించడం.

ఈ మూడు మంత్ర దండాల్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠ శాలల్ని నడపలేమా అనే ప్రశ్నను అందరు ముఖ్యంగా ప్రభుత్వం, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వేసుకోవాలి.

అవునని భావిస్తే గ్రామీణా ప్రాంతాల తల్లిదండ్రులను కాదు, పట్టణ ప్రాంతాల తల్లిదండ్రుల్ని కూడా మెప్పించగలం. కాదనుకుంటే ముందే ఇష్టపడే తల్లిదండ్రుల్ని ఒప్పించి వారి పిల్లలు వచ్చేలా చూడాలి.

దీనికై కొన్ని విధివిధానాల్ని పాటించాలి. ఇందులో కామన్‌స్కూల్‌ విధానం, నైబర్‌హుడ్‌ స్కూలు పద్ధతి ఆచరణీయ మైనవి. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి పూర్తిగా సాధ్యమయ్యే విధానాలు.

ఓ ఆవాస ప్రాంతంలోని పిల్లలందరూ స్వయంగా కాలి నడకన అందుబాటులో ఉన్న ఆవాస ప్రాంత పాఠశాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తారు. అలాగే తిరిగి వెళ్లగలరు.

అవసరమైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలకు తీసుకొని రాగలరు. ఇలా సామాజిక దూరం పాటించడం చాలా సులభం.

Masks in Schools
Masks in Schools

ఇక పాఠశాలకు వచ్చిన పిల్లలందరూ శుభ్రంగా కాళ్లు చేతులు సబ్బుతో కడుక్కునే సదుపాయం కల్పించాలి. దీన్ని ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.

ఇలా శుభ్రం చేసుకున్న పిల్లల్ని పాఠశాల ఆవరణలోకి పంపాలి.

తర్వాత ముందే నిర్దేశించుకున్న దూరాల్లో వరుసక్రమంలో పిల్లల్ని కూర్చోపెట్టాలి. మాస్కూల విషయంగా జాగ్రత్తపడాలి. అవసర మైతే ప్రభుత్వమే వారానికొక మాస్కూను పిల్లలకు అందించాలి.

స్థానిక డ్వాక్రా గ్రూపులచే ఇవి అందేలా చూడాలి.

రెండో అంశం పిల్లల సంఖ్య, తరగతి గదుల లభ్యత, సర్వశిక్షా అభియాన్‌ ద్వారా, ఆర్‌టిఇ 2009 ద్వారా ఓవర్‌సేస్‌ అభివృద్ధి నిధుల ద్వారా దాదాపుగా తరగతి గదుల కొరత చాలా వరకు తగ్గిపోయింది.

పైగా పెద్ద వైశాల్యంగల తరగతి గదులు, విశాల మైన వరండాలు అందుబాటులోకి వచ్చాయి. మరీ ఇబ్బందికరంగా ఉన్న పాఠశాలల్లో చెట్ల కింద నిర్వహించవచ్చు.

ఇలా తరగతి గదిలో 20 మంది (బెంచికి ఇద్దరు చొప్పున) 10 బెంచీలకు సులభంగా కూర్చోవచ్చు.

ఇంతకన్నాఎక్కువ మంది విద్యార్థులుంటే పెద్దగదులను వీరికి కేటాయించాలి. వరండాలో కలిపి కూర్చోబెట్టాలి.

అయినా ఇబ్బంది ఉందని భావిస్తే చాలా ఆవాస ప్రాంతాల్లో దేవాలయాలు, చిన్నపాటి కమ్యూనిటీ హాళ్లు ఉంటాయి కాబట్టి వాటిని గ్రామసహకారంతో వాడుకోవాలి.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.

అత్యధిక పాఠశాలలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:10/1:20 అత్యధికంగా 1:30కి మించిలేదు.

ఒకటి, రెండు శాతం పాఠశాలల్లో అదీ 8,9,10 తరగతుల్లో పిల్లల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2015-16 విద్యాసంవత్సరంలో తెలంగాణలో వివిధ స్థాయిలలో అత్యధిక ప్రాథమిక పాఠశాలల్లో 60 మంది పిల్లలు మించిలేరు.

కొన్ని పాఠశాలలో 100 వరకు వ్ఞన్నా అయిదుగురు ఉపాధ్యాయులుంటే 1:20గా, నలుగురు ఉపాధ్యాయులుంటే 1:25గా విద్యా ర్థులుంటారు.

వీరిని సులభంగా దూరాన్ని పాటిస్తూ కూర్చోబెట్ట వచ్చు.

గత నాలుగు సంవత్సరాలుగా ఉపాధ్యాయుల నియామకం లేక విద్యార్థుల సంఖ్య ప్రాథమిక స్థాయిల్లో బాగా పడిపోయింది కూడా. సెకండరీ పాఠశాలల స్థితి ఇదే!

అయినా విద్యార్థులు అధి కం అని భావిస్తే షిప్టు పద్ధతిలో కొన్ని తరగతుల్ని నడపవచ్చు.

ఈ విధానం పట్టణాల్లో కూడా అమలు జరుగుతుంది. ఎందుకంటే ప్రధాన పట్టణాల్లోని ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థులసంఖ్యతక్కువే.

ఈ విధానం అమలు చేస్తే ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాలలకే వస్తారు. ఈ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమం ఉంది.

కాబట్టి మాధ్యమం సమస్య కూడా కాదు.దీంతో ప్రభుత్వపాఠశాలలు తిరిగి బలోపేతం అవుతాయి.

నిజంగానే విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయుల నియామకం చేయాలి. అలాగే కమ్యూనిటీ హాళ్లను, ఫంక్షన్‌ హాళ్లను ప్రభుత్వం అద్దెకి వాడుకోవాలి.ఈ విధానం ఉభయతారకంగా ఉంటుంది.

ఈ కరోనా కష్టకాలంలో పట్టణాల నుంచి వచ్చే ఉపాధ్యాయులపై గ్రామస్తుల కు, తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవడం.

కరోనా నెగిటివ్‌ అనే నమ్మకం కలిగించాలంటే ఉపాధ్యాయులు విధిగా ఆయా ఆవాస ప్రాంతాల్లోనే ఉండాలి.

ఇది ఇబ్బందికరమే అయినా పాఠశాలలు నడవాలన్నా, ఉపాధ్యాయరంగం భద్రంగా ఉండా లన్నా ఇది అనివార్యం. దీనికై ఉపాధ్యాయులే ముందుకు రావాలి.

-డాక్టర్‌ లచ్చయ్య గాండ్ల

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/