జగన్ మరోసారి సీఎం కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా – ధర్మాన

జగన్ మరోసారి సీఎం కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని ప్రకటించారు మాజీ ఉప ముఖ్యమంత్రి, నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్. ఇటీవల మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామా చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్దమని ప్రకటిస్తున్న వేళ.. ధర్మాన కృష్ణదాస్ నోటి వెంట ఈ మాట రావడం ఆసక్తికరంగా మారింది. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని చీడిపూడి గ్రామంలో నిన్న జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తాను ఎమ్మెల్యేగా గెలిచినా రాజీనామా చేస్తానని అన్నారు.జగన్ సమర్థుడైన నాయకుడని, పొత్తు లేకుండానే అన్ని స్థానాలకు పోటీ చేస్తారని కృష్ణదాస్ పేర్కొన్నారు.

పొత్తు లేకుండా టీడీపీ, జనసేన 175 స్థానాల్లో పోటీ చేయగలవా? అని ప్రశ్నించారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయాలని జగన్ చూస్తున్నారని అన్నారు. టీడీపీ, జనసేన మాత్రం ఆ 25 గ్రామాల ప్రజల కోసం పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు. చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నారని ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.