ఐసిఐసిఐ నిర్లక్ష్యం.. రూ.43 లక్షలు మాయం

తన ఎఫ్‌డిలోని నగదును మాయం చేశారని బ్యాంకుపై ఫిర్యాదు చేసిన ఎన్నారై

ICICI bank
ICICI bank

హైదరాబాద్‌: ఐసిఐసిఐ బ్యాంకు నిర్లక్ష్యంతో ఓ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలోని రూ. 43 లక్షలు మాయం చేసింది. ఈ ఘటనలో బాధితుడైన ఎన్నారై ఉత్తమ్‌ కుమార్‌ వివరాల ప్రకారం సికింద్రాబాద్‌లో గల ఐసిఐసిఐ బ్యాంకు ఖాతాలో రూ. 50 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి ఆయన యుఎస్‌ వెళ్లిపోయారు. గతేడాది డిసెంబర్‌లో అకౌంట్‌ చూసుకోగా, పాస్‌ వర్డ్‌ మరినట్లు సమాచారం అందింది. దీంతో బ్యాంకును సంప్రదించగా అటునుంచి పాస్‌వర్డ్‌ మార్చుకోవాలన్న సూచన వచ్చింది. పాస్‌ వర్డ్‌ మార్చి ఖాతాలో చూడగా రూ. 43,07,535 విత్‌డ్రా చేసుకున్నట్లు చూపించింది. దీనిపై బ్యాంకు స్పందన సరిగా లేక పోవడంతో ఉత్తమ్‌ కుమార్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో నిందితుల్లో కొందరు విదేశాలకు పారిపోవడంతో రూ. 2 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకోగలిగారు. తాను మోసపోవడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం అని సచివాలయంలోని రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(అడ్జ్యుడికేటింగ్‌ ఆఫీసర్‌) ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అధికారులు తప్పు బ్యాంకుదేనని తేల్చి చెప్పారు. అంతేకాకుండా పోయిన సొమ్ము మొత్తానికి 9 శాతం వడ్డీ, ఖర్చుల కింద రూ.50 వేలు, మానసికంగా బాధితుడ్ని ఇబ్బందులకు గురిచేసినందుకుగాను రూ.5 లక్షలు కలిపి చెల్లించాలని ఆదేశించారు. అయినా సదరు బ్యాంకు పట్టించుకోకపోవడంతో బ్యాంకు ఆస్తులను జప్తు చేసి తనుకు న్యాయం చేయాలని ఉత్తమ్‌ కుమార్‌ మరోసారి అధికారులన ఆశ్రయించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/