క్షీణించిన ఐసిఐసిఐ బ్యాంక్ లాభాలు

icici-bank
icici-bank

ముంబయి: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం( 2019 20) రెండో త్రైమాసికంలో నష్టాలు నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం 28 శాతం క్షీణించి రూ.655 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది (2018 19)ఇదే సమయంలో బ్యాంక్ రూ.909 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే నికర వడ్డీ ఆదాయం మాత్రం 26 శాతం పెరిగి రూ.8057 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ప్రొవిజన్లు రూ.3994 కోట్లనుంచి రూ.2507 కోట్లకు క్షీణించాయి. మరో వైపు ఇతర ఆదాయం రూ.3156 కోట్లనుంచి రూ.4194 కోట్లకు పెరిగింది. పన్ను వ్యయాలు రూ.346 కోట్లనుంచి రూ.3712 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 13 శాతం రుణ వృద్ధిని బ్యాంక్ సాధించింది. ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐసిఐసిఐ బ్యాంక్ స్థూల మొండి బకాయిలు (ఎన్‌పిఎలు) 6.4 శాతంనుంచి 6.9 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పిఎలు మాత్రం 1.77 శాతంనుంచి 1.74 శాతానికి తగ్గాయి. స్థూల స్లిప్పేజిలు రూ.2779 కోట్లనుంచి రూ.2482 కోట్లకు తగ్గాయి. మరోవైపు నికర వడ్డీ మార్జిన్లు 3.61 శాతంనుంచి 3.64 శాతానికి మెరుగుపడ్డాయి. కాగా ఫలితాలపై అంచనాలతో శుక్రవారం న్‌ఎస్‌ఆలో ఐసిఐసిఐ బ్యాంక్ షేరు3.2 శాతం పెరిగి రూ.469 వద్ద ముగిసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/