ఫిక్సింగ్‌కు చెక్ పెట్టేందుకు ఐసిసి కొత్త ప్రణాళిక

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మే30 నుంచి ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ అంశాలకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) కొత్త ప్రణాళిక రూపొందించింది. మెగా టోర్నీలో పాల్గొంటున్న ప్రతి జట్టుతో ఒక్కో అవినీతి నిరోధక అధికారి( ఏసిమూ) ఉండేలా ఐసిసి నిర్ణయం తీసుకుంది.
ప్రపంచకప్‌లో పాల్గొనే మొత్తం 10 జట్లకు పది మందిని ఎంపిక చేసినట్లు ఐసిసి తెలిపింది. ఏసియూ అధికారి వార్మప్ మ్యాచ్‌ల నుంచి ఫైనల్ వరకు అన్ని సమయాల్లో జట్టుతోనే ఉంటారని వెల్లడించింది. ఇంతకుముందు ఒక్కో వేదిక వద్ద ఒక్కో అవినీతి నిరోధక అధికారి ఉండేవారు. ఐతే ప్రస్తుతం ఏసియూ అధికారి జట్టు బస చేసే హోటల్లోనే ఉంటారు. అంతేకాక క్రికెటర్ల ప్రాక్టీస్, ప్రయాణ సమయంలో కూడా జట్టుతోనే కలిసి తిరుగుతారు. ప్రతి నిత్యం జట్టుతో ఉండడం వల్ల ఫిక్సింగ్ అంశాలకు తావుండదని ఐసిసి పేర్కొంది. మరోవైపు ఆటగాళ్లు, ఏసియూకు మధ్య స్నేహబంధాలు కూడా పెరుగుతాయని ఐసిసి తెలిపింది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/sports/