రష్యాలో అన్ని కార్యకలాపాలు నిలిపివేత : ఐబీఎం

రష్యాలో వ్యాపార లావాదేవీలకు తీవ్ర ఇబ్బందులు

మాస్కో: రష్యాలో అన్ని కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు టెక్ దిగ్గజం ఐబీఎం ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో… రష్యాలో కార్యకలాపాలు కష్టసాధ్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తమ ఉద్యోగులకు లేఖ రాశారు. అంతేకాదు, ఉద్యోగులను తొలగించే ప్రక్రియ కూడా మొదలైందని సంకేతాలు ఇచ్చారు.

కొన్ని ప్రాంతాల్లో తమ ఉద్యోగులు, వారి కుటుంబాల భద్రత కూడా తమకు ముఖ్యమేనని, గత కొన్నినెలలుగా ఈ అంశంపైనే కంపెనీ దృష్టి సారించిందని అరవింద్ కృష్ణ వివరించారు. గత మార్చి నుంచే రష్యాలో తమ వ్యాపారం నిలిచిపోయిందని, అయితే ఉద్యోగులకు మాత్రం జీతాలు చెల్లించామని స్పష్టం చేశారు. కార్యకలాపాలు లేకపోయినా రష్యాలో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న నేపథ్యంలో దీనిపై దీర్ఘకాలిక ఐచ్ఛికాలను పరిశీలిస్తున్నామని వివరించారు.

యుద్ధ పర్యవసానాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయని, యుద్ధం శాఖోపశాఖలుగా విస్తరిస్తుండడంతో అనిశ్చితి, తత్సంబంధిత పరిణామాలు దీర్ఘకాలంలో పెరుగుతాయని అరవింద్ కృష్ణ పేర్కొన్నారు. ఐబీఎం విభాగం మూసివేత నిర్ణయం రష్యాలోని తమ ఉద్యోగులకు కష్టంగానే ఉంటుందన్న విషయం తెలుసని, వారికి కంపెనీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ఉద్యోగుల తప్పేమీలేదని, నెలల తరబడి అనిశ్చితి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. రష్యాలో తమ ఉద్యోగుల తదుపరి ఉపాధి దిశగా కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటుందని తన లేఖలో వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/