తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈరోజు సోమవారం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తెలంగాణ సర్కారు నియమించింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ ను , హ్యాండ్లూమ్స్‌, టీజీసీవో హ్యాండ్‌క్రాఫ్ట్స్‌ ఎండీగా ఆమెకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించిన ప్రభుత్వం.. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. మరో ఐఏఎస్ అధికారి అహ్మద్ నదీమ్ ను అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా అహ్మద్ నదీమ్ కు టీపీటీఆర్‌ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వీని కమర్షియల్ టాక్సెస్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు బదిలీ చేశారు. రవాణా శాఖ కమిషనర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రసాద్ ను రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖకు బదిలీ చేస్తూ.. ఇలాంబరితిని రవాణా శాఖ కమిషనర్ గా నియమించింది. అయితే, ఇలాంబరితి బాధ్యతలు స్వీకరించే వరకూ రవాణా శాఖ కమిషనర్ గానూ అదనపు బాధ్యతలు నిర్వహించాలని డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రసాద్ కు ప్రభుత్వం సూచించింది.