అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ చివరి సందేశం

తదుపరి ప్రభుత్వానికి శుభాకాంక్షలు..ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో అధ్య‌క్షుడు ట్రంప్ త‌న చివ‌రి సందేశం వినిపించారు. ఫేర్‌వెల్ వీడియో పోస్టు చేశారు. ఈ క్రమంలో దేశ ప్రజలనుద్దేశించి వీడ్కోలు సందేశం ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. 20 నిమిషాల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్రి రికార్డెడ్ వీడియోను వైట్ హౌస్ కార్యాలయం విడుదల చేసింది. ఏం చేసేందుకు అధికారంలోకి వచ్చామో..తన పాలనలో అన్నీ చేశామని ట్రంప్ చెప్పారు. చెప్పినదాని కన్నా ఎక్కువే చేశామని పేర్కొన్నారు. దేశం కోసం కఠినమైన యుద్ధాలు.. పోరాటాలను చేశామని ఆయన అన్నారు.

ప్రపంచ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆర్థిక వ్వవస్థను తమ ప్రభుత్వం నిర్మించిందిందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. రైటా, లెఫ్టా లేక రిపబ్లికనా లేక డెమొక్రాటా అన్నది తమ అజెండా కాదు. మెరుగైన దేశమే తమ అజెండా ఆయన అన్నారు. ఇటీవల కాపిటల్ భవనంపై జరిగిన దాడిపైనా ఆయన మాట్లాడారు. రాజకీయ హింసను అమెరికా విలువలపై జరిగే దాడిగానే చూడాలని.. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే సహించేది లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా భద్రత, అభివృద్ధి కోరుకునే వాడిగా.. తదుపరి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.


కాగా, 2017 జ‌న‌వ‌రి 20 నుంచి 2021 జ‌న‌వ‌రి 20 వ‌ర‌కు తాము ప్ర‌భుత్వంలో ఉన్నామ‌ని, ఈ స‌మ‌యంలో త‌మ ఎన్నో ఘ‌న‌త‌ను సాధించిన‌ట్లు ట్రంప్ తెలిపారు. చైనాతో ప‌న్నుల అంశంలో పోరాడామ‌ని, ఎన్నో ప‌న్ను సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌న్నారు. స్వ‌దేశంలోనూ, విదేశాల్లోనూ అమెరికా సామ‌ర్థ్యాన్ని బ‌ల‌ప‌రిచిన‌ట్లు ఆయ‌న తెలిపారు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే కోవిడ్ టీకా డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు చెప్పారు. ప్ర‌పంచ దేశాలు మ‌న‌ల్ని గౌర‌విస్తాయ‌ని, ఆ గౌర‌వాన్ని మ‌నం కోల్పోవ‌ద్దు అని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం చేప‌ట్టిన దౌత్య విధానాల వ‌ల్ల మిడిల్ఈస్ట్‌లో అనేక శాంతి ఒప్పందాలు జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు. అమెరికా చ‌రిత్ర‌లో ఎటువంటి కొత్త యుద్ధాలు చేప‌ట్ట‌ని మొట్ట‌మొద‌టి అధ్య‌క్షుడినంటూ ట్రంప్ పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/