సమస్యలకు భయపడే మనస్తత్వం నాకు లేదు

pm modi
pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రసంగిస్తూ..తమ ప్రభుత్వం సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అన్న విధానం వల్లే తిరిగి అధికారంలోకి వచ్చిందని మోడి అన్నారు. దేశాల్లో హింసను ఎదుర్కొంటున్న వారికి భారత పౌరసత్వం కల్పిస్తే వారికి మంచి భవిష్యత్తు అందించిన వారమవుతామని చెప్పారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ బిల్లును మోడి ఉటంకించారు. రాజకీయపరంగా క్లిష్టమైనప్పటికీ.. 370 అధికరణ రద్దు తర్వాత జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రజలు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంటున్నారని చెప్పారు. వారి జీవితాల్లో కొత్త ఆశలు ఊపిరి పోసుకుంటున్నాయన్నారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుచేసి ముస్లిం మహిళలకు న్యాయం చేశామన్నారు. అయోధ్య తీర్పు తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగుతాయంటూ కొంతమంది సందేహాలు వ్యక్తం చేశారని.. కానీ ప్రజలు సంయమనం పాటించి అవన్నీ తప్పని నిరూపించారన్నారు.

ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపర్చేలా ముందుకు సాగుతున్నామంటూ.. ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందని చెప్పారు. తన బాధ్యతలనుంచి పారిపోయే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. బ్యాంకుల విలీనం వంటి ఓ సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారత్ ర్యాంక్ మెరుగుపడిందన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు కల్పించడానికి ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/