విజయం సాధించే బాటాలో ఉన్నాం..బైడెన్
దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన జో బైడెన్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కాసేపటి క్రితం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఉన్నామని బైడెన్ అన్నారు. దిలావేర్ నుంచి ఆయన మాట్లాడుతూ.. ఇలా రసవత్తర పోటీ ఉంటుందని మాకు ముందే తెలుసు అని, కానీ వచ్చిన ఫలితాల పట్ల మేం సంతోషంగా ఫీలవుతున్నామని, ఇది నిజంగా అద్భుతమని బైడెన్ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించే బాటలో ఉన్నామన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తేల్చేందుకు దేశం యావత్తు చివరి ఓటును లెక్కించే వరకు వేచి ఉండాలన్నారు. మద్దతుదారులంతా సంయమనంతో ఉండాలని ఆయన కోరారు. ఫలితాలపై విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. తుది ఫలితాలు అనుకూలంగా ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆరిజోనాలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం బైడెన్ 237, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లను కైవసం చేసుకున్నారు. మరికాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్ కూడా దేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/