బిఆర్ఎస్ సభకు నేను వెళ్లడం లేదు – బీహార్‌ సీఎం నితీశ్‌

ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కాబోతుంది. అదే రోజు హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను సీఎం కేసీఆర్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు కీలక నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కూడా కేసీఆర్ ఆహ్వానం పంపారు. కానీ ఈ సభ కు ఆయన రావడం లేదని తెలిపారు.

బీఆర్‌ఎస్‌ మలికేక సభకు తమ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, జనతాదళ్‌ (యూ) ప్రెసిడెంట్‌ రాజీవ్‌ రంజన్‌సింగ్‌ అలియాస్‌ లలన్‌ను వెళ్లాలని తాను కోరినట్టు బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ వెల్లడించారు. కైమూర్‌ జిల్లా పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సభకు హాజరుకావాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నన్ను కోరారు. కానీ, ముందస్తు షెడ్యూల్‌ వలన తీరిక లేకుండా ఉన్నానని చెప్పా. పార్టీ తరపు నుంచి ఎవరినైనా పంపించాలని కేసీఆర్‌ కోరారు. దీంతో సభకు వెళ్లాలని నేను లలన్‌ను కోరాను.’ అని తెలిపారు.

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఎందుకు వెళ్లలేదని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… అప్పుడు తనకు ఆహ్వానం అందలేదని, ఒకవేళ పిలుపు వచ్చినా అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో వెళ్లలేకపోయేవాడినని నితీశ్ చెప్పారు. వచ్చే నెల జరగనున్న కార్యక్రమానికి రావాలని కేసీఆర్ ఆహ్వానించారని… అయితే పని ఒత్తిడి కారణంగా రాలేనని చెప్పానని… దీంతో, తేజస్విని అయినా పంపమని కేసీఆర్ కోరారని తెలిపారు.