రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఫీలింగ్స్ ఉండవా?: సచిన్ పైలట్

గెహ్లాట్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన సచిన్ పైలట్

i-am-also-human-and-i-did-feel-sad-and-hurt-says-sachin-pilot

జైపూర్‌ః రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఫీలింగ్స్ ఉండవని భావించొద్దని రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ చెప్పారు. కొన్ని వ్యాఖ్యలు తనను బాధించాయని, అయితే మళ్లీ గతంలోకి తొంగిచూడాలని భావించట్లేదని తేల్చిచెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ ల మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. గత నెలలో గెహ్లాట్ తనపై చేసిన వ్యాఖ్యలపై పైలట్ తాజాగా స్పందించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పైలట్ మాట్లాడారు.

‘నేను రాజకీయ నాయకుడినే. కానీ నేను కూడా మనిషినే. నేను కూడా బాధపడతా, నేనూ అవమానం ఫీలవుతా’ అని పైలట్ చెప్పారు. తనను విశ్వాసఘాతకుడు(గద్దర్) అంటూ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి పైలట్ ఈ విధంగా స్పందించారు. అయితే, గతాన్ని తవ్వుకుంటూ బాధపడే వ్యక్తిని కాదని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని పైలట్ వివరించారు. రాష్ట్రంలో నాయకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కిందటి నెలలో పైలట్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ విశ్వాసఘాతకుడు రాజస్థాన్ కు ఎప్పటికీ సీఎం కాలేడని గెహ్లాట్ తేల్చిచెప్పారు. పార్టీ హైకమాండ్ కూడా పైలట్ ను ముఖ్యమంత్రి చేయదని స్పష్టంచేశారు. పార్టీని మోసం చేసిన, కనీసం పది మంది ఎమ్మెల్యేల మద్ధతు కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కల్ల అని గెహ్లాట్ పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/