నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌..

నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్‌ రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయి. ఆపరేషన్ రోప్ (అడ్డంకెల పార్కింగ్ మరియు ఆక్రమణల తొలగింపు)ను ట్రాఫిక్ పోలీసులు ముమ్మరం చేశారు. ఫుట్ పాత్ మీద ఉన్న ఆక్రమణలపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఫుట్‌పాత్‌, పార్కింగ్‌ ఆక్రమణపై ప్రత్యేక దృష్టి పెట్టామని ట్రాఫిక్ పోలీసు జాయింట్ కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్‌ను తగ్గించి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ‘ఆపరేషన్‌ రోప్‌’ పేరుతో కొత్త నిబంధనలు ఈరోజు నుండి అమల్లోకి తీసుకొచ్చారు.

వ్యాపారాల పేరుతో ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే.. భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని దుకాణదారులను హెచ్చరించారు. పాదచారులకు ఆటంకం కలిగేలా పుట్‌పాత్‌లపై, రోడ్డు పక్కన వాహనాలు నిలిపితే రూ.600 ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. రూల్స్ బ్రేక్ చేసి వాహనాలు నడిపితే జరిమానాలు తప్పవని జాయింట్ హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ఉచిత క్యారేజీ మార్గం కోసం చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న సంస్థల యజమానులందరూ స్వచ్ఛందంగా ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.