తెలంగాణ లో ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్ కు ఈరోజే చివరి రోజు

తెలంగాణ రాష్ట్రంలో వాహనదారుల పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ల ఆఫర్ గడువు ఈరోజుతో ముగియనుంది. ముందుగా గత నెలాఖరు వరకే ఈ ఆఫర్ ఉండగా.. ఆ తర్వాత ఈ నెల 15 వరకు దాన్ని పొడిగించారు. ట్రాఫిక్ చలాన్ల రాయితీ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రవ్యాప్తంగా 2.40 కోట్లకు పైగా చలాన్లు మార్చి 31 వరకు కట్టేసినట్లు అధికారులు తెలుపడం జరిగింది. దీని ద్వారా రూ.250 కోట్ల చెల్లించి పెండింగ్ చలానా క్లియర్ చేయడం జరిగిందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఇది ఈరోజు తో ముగుస్తుందని, మళ్లీ పొడిగింపునకు అవకాశం లేదని ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు. రాయితీ వర్తింపు గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోలేకపోతే తర్వాత భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. ఈ-చలాన్ వెబ్‌సై‌ట్‌లో ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచించారు.

దేనిపై డిస్కౌంట్లు ఎంత అనేది మరోసారి చూస్తే..

  • టువీలర్/త్రీవీలర్ కట్టాల్సింది: 25%, డిస్కౌంట్ 75%
  • ఆర్టీసీ బస్సు డ్రైవర్స్ కట్టాల్సింది 30%, డిస్కౌంట్ 70%
  • లైట్ మోటార్ వెహికల్స్/హెవీ మోటర్ వెహికల్స్ కట్టాల్సింది: 50%, డిస్కౌంట్ 50%
  • తోపుడు బండ్ల వ్యాపారులు కట్టాల్సింది 20%, డిస్కౌంట్ 80%
  • నో మాస్క్ ఫైన్‌కు కట్టాల్సింది: రూ.100, డిస్కౌంట్ రూ.900