ముగ్గురిని గాయపరిచిన అడవి పంది

రాత్రి పూట ఇంట్లోకి చొరబడి దాడి

wild boar attack in house at shamshabad
wild boar attack in house at shamshabad

హైదరాబాద్‌: అడవి పంది దాడి చేసిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ అలీ ముక్తా బస్తీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చెన్నపు జంగయ్య, నర్సమ్మ దంపతులు కూలీ పని చేసుకుంటూ ఇక్కడ జీవిస్తున్నారు. వారి కుమారుడు యాదయ్య, కోడలు మంజుల పక్క ఇంట్లో ఉంటున్నారు. ఉక్కపోత కారణంగా జంగయ్య ఇంటి తలుపులు తెరచి నిద్రిస్తుండగా…అడవి పంది రాత్రిపూట ఇంటిలోకి ప్రవేశించింది. ఉదయం నిద్రలేచి ఇంట్లోని మరుగుదొడ్డికి వెళ్లిన జంగయ్యపై అప్పటికే అందులోకి చొరబడిన అడవి పంది దాడి చేసింది. ఆయన పెద్దగా కేకలు వేయడంతో పక్క ఇంట్లో నిద్రిస్తున్న యాదయ్య, కోడలు మంజుల ఇంట్లోకి పాము వచ్చిందని భావించి కర్ర తీసుకుని వచ్చారు. అడవి పంది వారిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న వారిని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తండ్రి, కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అడవి పందులు రాత్రి పూట ఇళ్లలోకి చొరబడి ఎక్కడ మళ్లీ దాడి చేస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/