నగరవాసులకు షాకింగ్ న్యూస్ : 3 రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

హైదరాబాద్ నగరవాసులకు దక్షిణ మధ్య రైల్వే షాకింగ్ న్యూస్ ను తెలిపింది. మూడు రోజుల పాటు 33 ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీస్ లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్య దక్షిణ మధ్య రైల్వే పెద్ద ఎత్తున MMTS సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది. నగరంలో మెట్రో అందుబాటులోకి రాకముందు నగరవాసులు ఎక్కువగా ఎంఎంటీఎస్ రైళ్లలోనే ప్రయాణించేవారు. ప్రతి రోజు లక్షల్లో ఆఫీసులకు , వారి గమ్యస్థానానికి చేరుకునే వారు. కానీ మెట్రో ప్రారంభం అయినదగ్గరి నుండి ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో పలు సర్వీస్ లను రద్దు చేస్తూ వస్తుంది దక్షిణ మధ్య రైల్వే. ఈ మధ్య అయితే పట్టుమని పది సర్వీస్ లు కూడా నడవడం లేదు. వీకెండ్ లలో చాల సర్వీస్ లను రద్దు చేస్తుంది. అసలు ఏ రోజు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయో..నడవడం లేదో అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈరోజు ( ఫిబ్రవరి 20 ) నుండి హైదరాబాద్‌లో మూడు రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సాంకేతిక కారణాలతో మొత్తం 33 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరింది. లింగంపల్లి-హైదరాబాద్, హైదరాబాద్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్-లింగంపల్లి, లింగంపల్లి-సికింద్రాబాద్, రామచంద్రాపురం-ఫలక్‌నుమా, ఫలక్‌నుమా-రామచంద్రాపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్ రైలు సర్వీసులను నేటి నుంచి బుధవారం వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. గురువారం నుంచి ఎంఎంటీఎస్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.