హైదరాబాద్​ను అతలాకుతలం చేసిన భారీ వర్షం

మరోసారి భారీ వర్షం హైదరాబాద్​ను అతలాకుతలం చేసింది. శుక్రవారం ఉదయం నుండి హైదరాబాద్ లో వర్షం పడుతూనే ఉండగా..సాయంత్రం ఒక్కసారి కుంభవర్షం పడింది. దీంతో లోతట్టుప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఎక్కడ చూసిన..ఎటు చూసిన వరదనీరే కనిపిస్తుంది. రోడ్లన్నీ నదులను తలపించాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు కొన్ని చోట్ల ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

హఫీజ్ పేట్, బాలానగర్ లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూకట్ పల్లి, శేర్లింగంపల్లి వెస్ట్ లో 6.8 సెంటీమీటర్లు.. మియాపూర్, మాదాపూర్, ఆర్సిపురంలో 7.6 సెంటీమీటర్లు.. ఏఎస్ రావు నగర్ లో 7.1 సెంటీమీటర్లు.. మౌలాలిలో 7.2 సెంటీమీటర్లు.. కుత్బుల్లాపూర్ లో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్ లో 5.4 సెంటీమీటర్లు..చర్లపల్లిలో 5.2 సెంటీమీటర్లు.. బోరబండ యూసఫ్ గూడాలో 5.1 సెంటీమీటర్లు.. జూబ్లీహిల్స్, పాటిగడ్డ, నాంపల్లిలో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని ప్రసూన నగర్, మల్లికార్జున నగర్, వాని నగర్, ఇంద్ర సింగ్ నగర్, శ్రీనివాస్ నగర్​ను వరద ముంచెత్తింది. నాలాల్లోని వరద కాలనీల్లోకి రావడంతో డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సురారం ప్రధాన రహదారిపై భారీగా వర్షం నీరు నిలవడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ రాంనగర్, వెంకటేశ్వర కాలనీలోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. జీడిమెట్ల డిపో వద్ద వరద నీరు రోడ్డుపై నిలిచింది. భారీ వర్షానికి చార్మినార్ సమీపంలోని మక్కా మసీదు ప్రాంగణంలో మదద్ ఖానా గోడ కూలింది.

మరోవైపు షియర్‌ జోన్‌ ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.