హుజురాబాద్ ఉప ఎన్నికలు : పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసిన అధికారులు

గత మూడు నెలలుగా హుజురాబాద్ నియోజకవర్గం రాజకీయ నేతలతో , కార్యకర్తలతో సందడి సందడిగా మారింది. ఎటు చూసిన రాజకీయ ప్రసంగాలు , జెండాలు , ప్లెక్సీ లతో నియోజకవర్గం నిండిపోయింది. మరికొద్ది సేపట్లో ప్రచారానికి తెరపడనుంది. అక్టోబర్ 30 న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇవాళ రాత్రికి 7 గంట‌ల‌కు ప్ర‌చారం ముగియ‌నుంది. దీంతో పోలింగ్‌కు 72 గంట‌ల ముందే ప్ర‌చారం ఆగిపోనుంది. మరోపక్క ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసి ఉంచారు.

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 2,36,859 మంది ఓట‌ర్లు ఉన్నార‌ని, ఇందులో పురుష ఓటర్లు 1,17,768, మహిళ ఓటర్లు 1,19,090 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓట‌ర్లు 14 మంది ఉండ‌గా, స‌ర్వీస్ ఓట‌ర్లు 149, పీడబ్ల్యు ఓటర్లు 8,246, ట్రాన్స్ జెండ‌ర్ ఒక‌రు ఉన్నారు. 18-19 ఏండ్ల ఓటర్లు 5,165 మంది ఉండ‌గా, 80 ఆపై వయస్సున్న‌ ఓటర్లు 4,454 మంది ఉన్నారు. ఈ తరుణంలో నియోజ‌క‌వ‌ర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓట‌ర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ రోగుల‌కు పోస్టల్ బ్యాలెట్ సౌక‌ర్యం క‌ల్పించ‌నున్నారు.