నిజామాబాద్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన..అందంగా లేదని కట్టుకున్న భార్య ను చంపేసిన భర్త

అందంగా లేదని కట్టుకున్న భార్య ను అతి కిరాతకంగా యాసిడ్ తాగించి చంపేశాడు ఓ భర్త. మూడు నెలల కడుపుతో ఉన్న కనీసం కనికరం లేకుండా చంపేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజ్‌పేట్ తండాలో చోటుచేసుకుంది.

వర్ని మండలం రాజ్‌పేట్ తండాకి చెందిన తరుణ్‌కి మల్కాపూర్‌కి చెందిన కల్యాణితో నాలుగేళ్ల కిందట పెళ్లి అయ్యింది. కొన్ని నెలల పాటు సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. అందంగా లేవంటూ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. నాకు ఈడుజోడు కాదంటూ ఇబ్బందిపెట్టేవాడు. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని.. లేకుంటే వదిలేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. అతనికి అత్తమామలు కూడా తోడయ్యారు.

ఇంతలోనే ఆమె గర్భం దాల్చింది. కడుపులో బిడ్డను మోస్తోందన్న కనీస కనికరం కూడా లేకుండా కోడలిని వేధింపులకు గురిచేశారు. చివరికి ఆమెను అంతం చేయాలని నిర్ణయించుకున్న దుర్మార్గులు దారుణానికి ఒడిగట్టారు. మూడు నెలల గర్భంతో ఉన్న కల్యాణికి బలవంతంగా యాసిడ్ తాగించారు. ఆమె కేకలు విని పక్కింట్లో ఉన్న బంధువులు వచ్చేసరికి ఆమె నురగలు కక్కుతూ పడిపోయి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది.