మానవసేవే మాధవ సేవ

Sri Rama krishna paramahamsa

శ్రీరామకృష్ణ పరమహంస ఈ పవిత్ర భారతదేశంలో ధార్మిక సంస్థలు, సేవాసంస్థలు, భజనమండళ్లు, సేవాసమితులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, ఉచిత వైద్య శిబిరాలను, అన్నదానాలను జరిపిస్తున్నాయి. మానవసేవయే మాధవసేవయని, జనులు సేవయే జనార్ధన సేవయి ప్రచారం చేస్తున్నాయి. అంతా బాగానే ఉంది. కానీ ఈ సంస్థల్లో కూడా ఎత్తులు పై ఎత్తులు వేయటం ఉంది. ఇక పదవులను పొందిన వారిని గానీ, సాధారణ సభ్యులను, వారి తీరుతెన్నులను గానీ గమనిస్తే ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు గుర్తుకొస్తారు.

ఆదర్పము, ఆ ఠీవి, ఆ మాటల కాఠిన్యమును చూస్తే ప్రజలపై అధికారం చెలాయించే అధికారుల లాగే కనపడతారు గానీ ప్రజలకు సేవ చేసే సేవకులుగా కనపడరు. అందరూ అలాగే ఉండరు గానీ అత్యధికులు అలాగే ఉంటారు. వారికి వీలు కాక రాజకీయాల్లోకి వెళ్లి ఉండరు గానీ విధిలేక ఈ సేవాసంస్థల్లో అధికార పదవులను అంటిపెట్టుకుని ఉంటారు. వారు చేస్తున్న సేవ సేవలాగ కాక అధికారాన్ని చెలాయించినట్లుగా ఉంటుంది. సేవకుల్లో ఉండవలసిన అణకువ, కంఠస్వరము మచ్చుకైనా కనపడవు. ఎందుకలా? వారు నిర్వహిస్తున్న అన్నదానం, జ్ఞానదానం, ఆరోగ్యదానం – అన్నీ మంచివే అయినా వారి ధోరణిలో, జీవన విధానంలో, ప్రవర్తనలో, ఆలోచనా సరళిలో మార్పు ఎందుకు రాలేదు? దీనికి శ్రీరామకృష్ణ పరమహంస అంటారు.

ఒకసారి ఒక పత్రికాధిపతి శ్రీరామకృష్ణుని దర్శించి, సంభాషించాడు. లోకోపకార పనులలో నిమగ్నం కావలసిందిగా ప్రజలకు బోధించమని రామకృష్ణులకు ఆయన సలహా ఇచ్చాడు. అప్పుడు ఆయనతో రామకృష్ణుడు ‘కొందరకు భోజనం పెట్టుట, రోగులకు చికిత్స చేయించుట, రోడ్లు వేయించుట, బావులను తవ్వించుట ఇంతేకదా లోకోపకారమనగా నీ అభిప్రాయము! ఇవి మంచి పనులే, ఎవరును కాదనరు. కానీ ఈ మహా విశ్వముతో పోల్చి చూచినచో, ఇవి ఏ పాటివి? క్షామదేవత నోటి నుండి ఎందరిని నీవు రక్షింపగలవు? ప్రపంచ యోగక్షేమములను కనుగొనగలవాడు పరమేశ్వరుడొక్కడే. మానవుడు మొదట తన్ను ఉద్ధరించుకొనుటకు ఈశ్వర సాక్షాత్కారమునొంది,

ఆయన వద్ద నుండి ఇతరులకు మేలు చేయు శక్తిని, అధికారాన్ని పొందవలెను. అహంకారమును పూర్తిగా విడిచిపెట్టినవాడు గాని లోకహితము చేయుటకు ఆనందమయమగు జగదీశ్వరి వలన అధికారమునొందజాలడు, అని చెప్పాడు.

‘నేను లోకోపచారం చేద్దునా? అని అడిగిన పాల్‌ బ్రంటన్‌కు, అవసరం లేదు. ముందు నీకు నీవే మేలు చేసుకో అని సలహా ఇచ్చాడు. భగవాన్‌ రమణమహర్షి. మన హృదయమంతా అహంకారంతో, పగ – ద్వేషాలతో, పేరు – ప్రతిష్టలు పొందాలన్న కోరికతో, పదవులను అధిష్టించాలన్న కక్కుర్తితో మలినమై ఉంటే మనం సమాజానికి ఏమి సేవ చేయగలం? అది బురద చేతులతో వస్తువులను శుభ్రం చేసినట్లే ఉంటుంది. అయితే రామకృష్ణుడు చెప్పినట్లు ఈశ్వర సాక్షాత్కారం, అనుమతి పొంది ఆ తర్వాతే సంఘసేవ చేద్దామంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఆత్మపరిశీలనతో అహంను విడిచి సేవలో నిమగ్నమవ్వాలి. అట్టి సేవయే నిజమైన ఆరాధన అవుతుంది.

  • రాచమడుగు శ్రీనివాసులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/