కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తూ విజయవాడలో భారీ హోర్డింగ్​లు..

కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను స్వాగతిస్తూ పార్టీ నేతలు ,కార్యకర్తలే కాదు ఏపీ ప్రజలు సైతం సంబరాలు చేసుకున్నారు. విజయవాడలోని వారధి ప్రాంతంలో కేసీఆర్​కు శుభాకాంక్షలు తెలియచేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్‌ పేరిట వెలసిన హోర్డింగ్​పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు మంత్రి కేటీఆర్ చిత్రాలను ముద్రించారు. వారధి సెంటర్​తో పాటు నగరంలోని వేర్వేరుచోట్ల పోస్టర్లు, హోర్డింగ్​లు ఏర్పాటయ్యాయి.

టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్‌ గా మార్చేశారు పార్టీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పర్వదినాన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది. దీంతో రాజకీయ నేతలంతా కూడా కేసీఆర్ కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. కర్నాకటలో రాబోయే ఎన్నికల్లో BRS జెండా ఎగుర వేయాలని కేసీఆర్ అన్నారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్న కేసీఆర్‌.. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టీఆర్‌ఎస్‌ను రాష్ట్రానికే పరిమితం చేస్తే అని చాలా మంది తనను అడిగినట్లు చెప్పారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని, తెలంగాణ మోడల్‌ దేశంలో అమలు కావాలని కేసీఆర్‌ చెప్పారు. బంగ్లాదేశ్‌కంటే వెనుకబడడమేంటని ప్రశ్నించారు. దేశ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ను తీసుకువచ్చినట్లు వివరించారు. రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు.