చైనా సరిహద్దుల్లోని తజికిస్థాన్‌లో భారీ భూకంపం

చైనా సరిహద్దుల్లోని తజికిస్థాన్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 5.37 గంటలకు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.

భూకంపం సంభవించిన ప్రాంతంలో జనాబా చాలా తక్కువగా ఉంటుంది. దాని చుట్టూ ఎత్తైన పామిర్ పర్వతాలు ఉన్నాయి. తజికిస్తాన్‌లోని అతిపెద్ద సరస్సులలో ఒకటైన సరెజ్ సరస్సు ఈ ప్రాంతంలో ఉంది.
ఆక్వామారిన్ రంగులో ఉండే ఈ సరస్సు 1911లో సంభవించిన భూకంపం ఫలితంగా ఏర్పడింది. పామిర్ పర్వతాలలో లోతైన సహజసిద్ద ఆనకట్ట సరెజ్ సరస్సు వెనుక ఉంది. ప్రకృతి వైపరీత్యాలతో ఒకవేళ ఈ ఆనకట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్య ఆసియాలో ఉండే తజికిస్థాన్‌ తరుచూ వరదలు, భూకంపాలు, కొండచరియలు, మంచచరియలు, మంచు తుఫాన్ల ముప్పును ఎదుర్కొంటోంది.