ఇబ్రహీంపట్నంలో భారీగా నగదు స్వాధీనం

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడుతున్నాయి. ఈ నెల 18న మునుగోడు నియోజయకవర్గంలోని గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షల నగదు పట్టుబడగా.. అంతకుముందురోజు మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్‌కు ఏకంగా కోటి రూపాయల నగదు చిక్కింది. ఇదే చెక్‌పోస్టు వద్ద ఈనెల 13న ఓ కారులో రూ.13 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే.

ఈరోజు శనివారం ఉదయం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ సమీపంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ఓ కారులో రూ.20 లక్షలు లభించాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వస్తున్న కారులో పోలీసులు తనిఖీలు చేయగా..ఓ కార్ లో రూ. 20 లక్షల డబ్బును గుర్తించారు. అలాగే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న రూ. 64 లక్షల 63 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టి, నగదు తరలిస్తున్న కారును గుర్తించి, ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ డబ్బును ఎక్కడ్నుంచి ఎక్కిడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.