కూతురుని ఎలా ఒప్పించాలి?

‘మనస్విని (ప్రతి శనివారం)

How to convince the daughter

నమస్కారం మేడమ్‌, నా పేరు విమల. నాకు ఒక్కగానొక్క కూతురు. తను డిగ్రీ పూర్తి చేసింది. కానీ డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ అతను మా అమ్మాయిని ఒదిలేసి వెళ్లిపోయాడు. మేము తనకి ఒక సంబంధం చూసాము. మా అమ్మాయి ఇప్పుడు వేరే అబ్బాయితో పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఆ అబ్బాయికి, వాళ్ల కుటుంబానికి మా అమ్మాయి చాలా బాగా నచ్చింది. మా అమ్మాయిని పెళ్లికి ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. ఈ సమస్యకి పరిష్కారం చూపండి మేడమ్‌. – విమల

మీరు మీ ఈ సమస్యను చక్కగా పరిషరించుకోగలరు. మీ అమ్మాయి విషయమై తొందరపడవద్దు. ఆమెకి ఇష్టమైతేనే పెళ్లి చేయండి. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె వివాహం చెయ్యకూడదు. వివాహానికి మానసిక సంసిద్ధత చాలా అవసరం. ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేస్తే, చాలా అనర్ధాలు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఆమెకిష్టమైనప్పుడే ఆమె వివాహం చెయ్యండి. ఆమెకిష్టమైన వరుణ్ణి మాత్రమే వివాహానికి ఎంచుకోండి. వివాహమనేది ఒక వ్యక్తిగత బాధ్యత. తొందరపాటు మంచిది కాదు. ఆమెని చదువకోనియండి. ఉద్యోగం చేసుకోనివ్వండి. వివాహానికి సంసిద్ధంగా ఉండేటట్లు మార్గదర్శనం చెయ్యండి. ఏ విషయంలోనూ బలవంతం మంచిది కాదు. ఆనందంగా ఉండాలి. జీవితం అమూల్యమైనది. ప్రతి దినం విలువైంది. అవగా హనతో, స్పష్టతతో జీవితాన్ని అపురూపంగా గడపాలి. వర్తమానంలో జీవించాలి. భవిష్యత్‌ గురించి ఆందోళనవద్దు. గడచిన కాలం గురించి చింతించవద్దు. దాని నుంచి నేర్చుకోవాలే తప్ప,బాధపడకూడదు. బాధపడితే ప్రయోజనం ఏమీ లేదు. అనారోగ్యం తప్ప. మానసికంగా ఆనందంగా ఉంటేనే, ఆరోగ్యంగా ఉండగలరు. మానసికంగా కుంగిపోతే, అనారోగ్యం పాలవుతారు.

నమస్కారం మేడమ్‌,
నా పేరు రజిత, నా వయస్సు 30 సంవత్సరాలు. నాకు ఇద్దరు పిల్లలు. ఈ మధ్య కాలంలోనే నా భర్త తాగుడుకు అలవాటయ్యాడు. కొన్ని రోజుల నుండి తాగి వచ్చి విపరీతంగా కొడుతున్నాడు. అలా కొట్టడం వల్ల పా తలకి గాయం అయ్యింది. ఈ విషయం మా పుట్టింటి వాళ్లకు తెలిసి, నా భర్తకి విడాకులు ఇవ్వ మంటున్నారు. కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఏం చెయ్యాలో తెలియడం లేదు. నాకు ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపండి మేడమ్‌. – రజిత

మీరు తప్పక మీ ఈ పరిస్థితి నుండి బయట పడగలరు. మీరు ఇలాంటి పరిస్థితిలో ఉండనవసరం లేదు. ఇలాంటి బాధలు భరించనవసరం లేదు. మీ తల్లిదండ్రుల సహకారంతో మీ పరిస్థితిని బాగు చేసుకోవచ్చు. ముందుగా మీకున్న వనరులను గుర్తించాలి. మీ సామర్ధ్యాలను మీరు తెలుసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ధైర్యంగా ఉండండి. మీరు తప్పక కౌన్సిలింగ్‌ తీసుకోండి. మీ కాపురాన్ని చక్కదిద్దుకొనే అవకాశం కూడా ఉంటుంది. సరిదిద్దుకోలేక పోతే విడాకులు తీసుకోవచ్చు. పునర్వివాహం చేసుకోవచ్చు.
ఉద్యోగం చేస్తూ పిల్లలను పెంచుకోవచ్చు. అలా అన్నిరకాలుగా మీ వనరులని బట్టి సమస్యను పరిషరించుకోవచ్చు. అన్నీ మీలోనే ఉన్నాయి. మీలోని తెలివి తేటలను వెలికి తియ్యండి. సానుకూలంగా ఆలోచించాలి. జీవితం విలువ తెలుసుకోవాలి. వర్తమానంలో జీవిస్తూ, జీవితాన్ని ఆనంద భరితంగా చేసుకోవాలి. జీవితంలోని తెలివి అని కానుకలను సద్వినియోగం చేసుకోవాలి. మీ విలువను మీరు గుర్తించాలి. మీ భర్తతో అనుబంధం పెంచుకునే వీలుంటే చాకచక్యంగా మీ సమస్యను పరిష్కరించుకోండి. మనం పరిష్కారం చేసుకునే దిశలో పయనిస్తే, అనేక మార్గాలు కనబడుతాయి. ఏది ఏమైనా జీవితాన్ని, గృహాన్ని ఆనందంగా మలచుకోవాలి. ఇది తప్పనిసరి.

  • డాక్టర్‌ ఎం. శారద, సైకాలజీ ప్రొఫెసర్‌

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/