భార‌త్‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూసే స‌హించం : రాజ్‌నాథ్‌ సింగ్

న్యూఢిల్లీ: శాన్ ఫ్రాన్సిస్కో లోని ఇండియ‌న్‌- అమెరిక‌న్ క‌మ్యూనిటీని ఉద్దేశించి రక్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌సంగించారు. ఈసందర్బంగా ఆయన చైనాకు మ‌రోసారి వార్నింగ్ ఇచ్చారు. భార‌త్‌కు ఎవ‌రైనా హాని త‌ల‌పెట్టాల‌ని భావిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమ‌ని తేల్చి చెప్పారు. భార‌త్‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూసే వారిపై క‌ఠినంగానే వుంటామ‌ని హెచ్చ‌రించారు. ప్ర‌స్తుతం భార‌త్ అత్యంత శ‌క్తిమంతంగా ఎదుగుతోంద‌ని, ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో కూడా టాప్‌లో ఉంద‌ని తెలిపారు.

‘భార‌త సైన్యం ఎలాంటి దీటైన జ‌వాబిచ్చిందో బ‌హిరంగంగా చెప్పలేను. అలాగే ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటుందో కూడా చెప్ప‌లేను. కానీ… చైనాకు మాత్రం ఓ హెచ్చ‌రిక వెళ్లింది. భార‌త ప్ర‌భుత్వం అలాంటి వాటిని ఉపేక్షించ‌ద‌న్న విష‌యం మాత్రం అర్థ‌మైంది. ఇండియాను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తే చూస్తూ ఊరుకోదు అన్న విష‌యం మాత్రం చైనాకు బోధ‌ప‌డింది. అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భార‌త్ దౌత్య‌ప‌రంగా ఓ దేశంతో స‌త్సంబంధాల‌ను కొన‌సాగించినంత మాత్రాన‌.. ఇత‌ర దేశంతో స‌రైన దౌత్య సంబంధాల‌ను కొన‌సాగించ‌ద‌న్న అర్థం కాద‌ని, అలాంటి దౌత్య నీతిని భార‌త్ ఎప్పుడూ అవ‌లంబించ‌ద‌ని అమెరికాకు పరోక్షంగా చుర‌క‌లంటించారు. భార‌త్ ఎప్పుడూ విన్‌-విన్ కాన్సెప్ట్ ప్ర‌కార‌మే దౌత్యాన్ని నెరుపుతుంద‌ని రాజ్‌నాథ్ తేల్చి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/