‘కృష్ణానదీ పరివాహిక ప్రాంతంలోని వారికి పక్కాఇళ్లు’

కలెక్టర్లకు సిఎం జగన్‌ ఆదేశం

AP CM Jagan video Conference with Collectors
AP CM Jagan video Conference with Collectors

Amaravati: ప్రకాశం బ్యారేజ్‌కు 7.50లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలున్న దృష్ట్యా ఆ మేరకు కృష్ణాజల్లా యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం, భారీ వర్షాలు, వరదలు, తదనంతరం పరిస్థితులపై, సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్లతోసిఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

ఇక్కడి కలెక్టర్‌క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, అధికారులు పాల్గొన్నారు.. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు వరద వస్తోందన్నారు.

శ్రీశైలం నుంచి 4లక్షల క్యూసెక్కుల నీరు విడుదలైన దృష్ట్యా మరో 24 గంటల్లో దీని ప్రభావం ఉంటుందని ఈ మేరకు కృష్ణా,గుంటూరు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

విజయవాడ లో కృష్ణానదీ పరివాహిక ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేయించి, వారికి తప్పనిసరిగా వసతి కల్పించి వారందరికీ పక్కాఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.

వేర్వేరు జిల్లాల్లో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. వారం రోజుల్లో పంట తదితర నష్టాలపై అంచనాలు పంపాలన్నారు.

వరదలు తగ్గాక పాము కాట్లకు అవకాశం ఉన్న దృష్ట్యా అన్ని పిహెచ్‌సిల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కలుషిత నీరు లేకుండా మంచి నీరు తాగునీరు సరఫరా చేయాలన్నారు.

ఎక్కడా వ్యాధులు ప్రభలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా డయేరియా వంటివి పూర్తిగా నివారించా లన్నారు. ఆమేరకు అన్ని పిహెచ్‌సిల్లో అవసరమైన మందులు అందు బాటులో ఉంచాలన్నారు. క్లోరినేషన్‌ కూడ చేపట్టాలన్నారు.

ఈసందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ, జిల్లాలో భారీ వర్షాలు, వరదలు కారణంగా 12,466 హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా వేశామ న్నారు..

ఈ సమావేశంలో జెసి (రెవెన్యూ) డాక్టర్‌ కె.మాధవీలత, విఎంసి కమిషనర్‌ వి.ప్రసన్నవెంకటేష్‌, డిఆర్వో వెంకటేశ్వరారవు, జలవనరులశాఖ ఎస్‌ఇ నరసింహమూర్తి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాస రావు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ప్రకాష్‌నాయుడు, ట్రాన్స్‌కో ఎస్‌సిఇ జయకుమార్‌, ఉద్యానవన శాఖ డిడి రవికుమార్‌, వ్యవసాయ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/