ప్రధాని మోడికి తేజశ్వి యాదవ్‌ లేఖ

ఆరేళ్ల క్రితం బీహార్ ప్రజలకు ఇచ్చిన్న హామీలు ఏమయ్యాయి?

tejashwi-yadavs

న్యూఢిల్లీ: ప్రధాని మోడికి ఆర్జేడీ నేత, మహా కూటమి సీఎం అభ్యర్థి తేజశ్వి యాదవ్ లేఖ రాశారు. గతంలో ఇచ్చిన హామీలలో మోడి చాలా వాటిని నెరవేర్చలేకపోయారని చెప్పారు. ఈ నెల 1వ తేదీన మోడికి రాసిన రెండు పేజీల ఈ లేఖను ఈరోజు ట్విట్టర్ లో తేజశ్వి షేర్ చేశారు.

‘ఆరేళ్ల క్రితం బీహార్ ప్రజలకు మీరిచ్చిన హామీలు మీకు గుర్తుండే ఉంటాయి. అని తేజశ్వి ఎద్దేవా చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, రాష్ట్రానికి రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని… ఈ రెండు హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. చట్టాల పేరుతో ఇంకెన్నేళ్లు బీహార్ కు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తారని నిలదీశారు. 40 మంది రాష్ట్ర ఎంపీల్లో 39 మందిని మీకు అందించిన బీహార్ కోసం చట్టాలను మార్పు చేయలేరా? అని ప్రశ్నించారు. ఎన్నో అంశాలకు సంబంధించి చట్టాలను సవరణ చేసిన మీరు… ఈ అంశంలో మాత్రం ఆ పని చేయలేరా? అని అడిగారు.

పాట్నా యూనివర్శిటీకి కేంద్ర హోదా కల్పిస్తామన్న హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని తేజశ్వి విమర్శించారు. బీహార్ పై సవతి ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా బీహార్ కూలీలను కేంద్రం చిన్న చూపు చూసిందని విమర్శించారు. విదేశాల్లోని ఎన్నారైలను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానాలను కేంద్రం ఏర్పాటు చేసిందని… ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మైళ్లు నడుస్తూ వచ్చిన బీహారీలను మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. బీహార్ లో మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తామంటూ బిజెపి ఇచ్చిన హామీపై కూడా తేజశ్వి మండిపడ్డారు. ఓటు వేసే పార్టీపై మనిషి జీవితం ఆధారపడేంత దారుణ స్థాయికి మనం పడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/