నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల సిఎం జగన్‌ శంకుస్థాపన

ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్న సీఎం

YouTube video
Hon’ble CM will be Unveiling of Plaque for Foundation Stone of Govt Medical College Narsipatnam

అమరావతిః సిఎం జగన్‌ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో ఈ కాలేజీని నిర్మించనున్నారు. రూ. 470 కోట్లతో నిర్మించే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులకు, రూ. 16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ… నర్సీపట్నంలో ఈరోజు రూ. 986 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశామని చెప్పారు. గత పాలకులు ఈ ప్రాంతాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో నర్సీపట్నం రూపురేఖలను మార్చబోతున్నామని చెప్పారు.

చేసేదే తాము చెపుతామని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని జగన్ అన్నారు. జగన్ మా నాయకుడు అని గర్వంగా చెప్పుకునేలా పాలిస్తానని చెప్పారు. రాష్ట్రంలో చెడిపోయిన రాజీయ వ్యవస్థ తయారయిందని అన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క మంచి పనైనా చేశారా? అని ప్రశ్నించారు. దత్తతండ్రి చంద్రబాబును నెత్తిన పెట్టుకుని దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఊరేగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైలాగులకు పవన్ యాక్టింగ్ చేస్తారని అన్నారు. ఈ భార్య కాకపోతే మరో భార్య అన్నట్టుగా పవన్ వ్యవహారం ఉంటుందని దుయ్యబట్టారు. ఒకరిది వెన్నుపోటైతే… మరొకరిది మోసమని అన్నారు. వీరిద్దరినీ చూస్తే ఇందేం ఖర్మ మన రాష్ట్రానికి అనిపిస్తుందని విమర్శించారు.

వచ్చే జనవరి నుంచి పెన్షన్లను రూ. 2,750కి పెంచుతామని జగన్ చెప్పారు. అవ్వతాతలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రతి 6 నెలలకు పెన్షన్ వెరిఫికేషన్ ఉంటుందని… దీనిపై కూడా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదని… తక్కువగా వచ్చిన జనాలను ఎక్కువగా చూపేందుకు తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. అందరినీ మోసం చేసిన చంద్రబాబు సభలకు జనాలు ఎందుకు వస్తారని ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/