గత ప్రభుత్వం ఇలాంటివి ఏనాడైనా చేసిందా ? : సీఎం జగన్

విద్యా దీవెన చివరి త్రైమాసికం ఫీజును తల్లుల ఖాతాల్లో జమచేసిన సీఎం జగన్

YouTube video
Hon’ble CM of AP will be Disbursing “JAGANANNA VIDYA DEEVENA” at S.V.U Stadium, Tirupati LIVE


తిరుపతి : సీఎం జగన్ తిరుపతిలో పర్యటిస్తున్నారు. ఇక్కడి ఎస్వీ యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యా దీవెన పథకం కింద జనవరి-మార్చి నెల నిధులను విడుదల చేశారు. విద్యా దీవెన చివరి త్రైమాసికానికి సంబంధించిన రూ.709 కోట్ల మేర ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఒక్క బటన్ నొక్కి జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..విద్యార్థులు ఫీజులు కట్టలేక చదువును మధ్యలో ఆపకూడదనే లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,994 కోట్లు ఖర్చు చేసింది. విద్యా దీవెన ద్వారా 10.85 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని సీఎం జగన్ అన్నారు. అవినీతికి తావులేని రీతిలో పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

కాగా, విద్యాదీవెన కార్యక్రమం సందర్భంగా సీఎం జగన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతోనూ, వారి తల్లిదండ్రులతోనూ సంభాషించారు. అంతేకాదు, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం బడులు మూసివేద్దామన్న ఆలోచనతో ముందుకు వెళ్లిందని, కానీ తాము నాడు-నేడు పేరుతో పాఠశాలలను పూర్తిగా మార్చివేశామన్నారు.

గత సర్కారు బకాయిలు పెడితే, తామే చెల్లించామని సీఎం జగన్ వెల్లడించారు. అవినీతికి ఆస్కారం లేని విధంగా తల్లుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామని వివరించారు. గతంలో చంద్రబాబు వసతి దీవెన, నాడు-నేడు వంటివి ఎప్పుడైనా అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. తాము ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేని దొంగల ముఠా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే టెన్త్ పరీక్ష పత్రాలను వాట్సాప్ ద్వారా లీక్ చేయిస్తోంది టీడీపీనే అని ఆరోపించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/