ఏడు రోజులు హోమ్ ఐసోలేషన్‌: కేంద్రం మార్గదర్శకాలు

ఇంట్లో ఒకరు హోం ఐసోలేషన్‌లో ఉంటే మిగతా వారు కూడా ఆ మార్గదర్శకాలు పాటించాలి

న్యూఢిల్లీ : హోం ఐసోలేషన్‌కు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం.. కరోనా సోకినవారు ఇకపై పది రోజులపాటు ఇంట్లో (హోం ఐసోలేషన్) ఉండాల్సిన పనిలేదు. కొవిడ్ సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత ఏడు రోజులు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని పేర్కొంది. గతంలో ఇది పది రోజులుగా ఉండేది. అయితే, ఈ ఏడు రోజుల్లో వరుసగా మూడు రోజులపాటు జ్వరం రాకుంటేనే ఇది వర్తిస్తుందని తెలిపింది. అంతేకాదు, ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.

అయితే, మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి అని పేర్కొంది. కరోనా రోగులకు దగ్గరగా ఉన్న లక్షణాలు లేనివారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అసవరం లేదని, వారు హోం క్వారంటైన్‌లో ఉండి ఆరోగ్యాన్ని గమనిస్తూ ఉంటే సరిపోతుందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిన్న విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, వరుసగా మూడు రోజులపాటు 100 డిగ్రీలకు మించి జ్వరం ఉన్నా, గంటలోపు ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే కిందికి పడిపోయినా, చాతీలో నొప్పి, ఒత్తిడి ఉన్నా, శ్వాసరేటు పడిపోయినా, అలసటగా ఉన్నా వెంటనే వైద్యసాయం తీసుకోవాలని సూచించింది. కరోనా సోకినట్టు నిర్ధారణ అయినప్పటికీ ఇంట్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ స్థాయి 93 శాతానికి మించి ఉండి, ఎలాంటి ఇబ్బందులు లేకుంటే మాత్రం వారిని అసింప్టమాటిక్ రోగులుగానే పరిగణిస్తారు.

ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు ఉండి, శ్వాసపరమైన ఇబ్బందులు లేకుండా, సాధారణ గది వాతావరణంలో 93 శాతానికి మించి ఆక్సిజన్ స్థాయి ఉంటే వారిని తేలికపాటి లక్షణాలున్న కరోనా రోగులుగా పరిగణిస్తారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు వ్యాక్సినేషన్ పూర్తయిన వ్యక్తి 24 గంటలూ అందుబాటులో ఉండాలి. ఇంట్లో ఒక రోగి కనుక హోం ఐసోలేషన్‌లో ఉంటే ఇంట్లోని మిగతావారు కూడా హోం క్వారంటైన్ మార్గదర్శకాలను పాటించాలి. వైద్యులను సంప్రదించకుండా సొంత వైద్యం చేసుకోకూడదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే శాస్త్రీయతలేని చికిత్సా విధానాలను అనుసరించడం ప్రమాదకరం. స్వల్ప లక్షణాలున్నవారు స్టెరాయిడ్లు వాడకూడదని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/