ఇల్లు అందంగా..

గృహాలంకరణ తీరుతెన్ను

Home decor style
Home decor style

ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలని, వారి కళ్లు మీ అభిరుచిని అభినందించాలని ఎవరికి ఉండదు.

అతిధులు సరే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు.

కాకపోతే అందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు.

అలాకాకుండా అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకుంటే సరి. బట్టలు తగ్గించే కొక్కేలు, కర్టెన్‌ రాడ్‌లు, పెన్‌స్టాండ్‌లు, గడియారాలు, నైట్‌లాంప్స్‌ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకుని చూడండి.

Home decor style

వాల్‌ స్టికర్స్‌ :

ఆన్‌లైన్‌ షాపింగ్‌లో ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికి అందుబాటులో ఉంటున్నాయి.

వీటి ధరలు కూడా మరి అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి.

గోడ రంగుని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్‌ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.

చిన్న చిన్న బొమ్మలతో:

ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, బజార్లలో కొనుక్కున్నవో, కీ చెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు.

ప్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబుల్‌ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.

పోస్టర్స్‌ :

గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాట్‌ పోస్టర్లే. కాకపోతే చవకగా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది.

మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి.

Home-decor-style
Home-decor-style

వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి.

ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.

ఉపాయం ఉంటే :

ఇల్లు మనది కాకపోవచ్చు. మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు. గోడకి ఏదన్నా అంటించడానికి మనస్కరించకపోవచ్చు.

అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది.

బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది. టివి కింద ఉన్న కేబుల్‌ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది.

కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది.

కావాలంటే ఒక్కసారి డ్రాయింగ్‌ రూమ్‌ని పరిశీలించి చూడండి. మీకే ఎంతబాగా అనిపిస్తుంది. మరీ మీరు మీ ఇంటిని ఈ విధంగానే చేస్తారు కదూ.

ఎప్పుడూ కాకపోయినా ఏదైనా ప్రత్యేక సందర్భాలలోనైనా ఇలాంటివి పాటిస్తే ఇల్లు అలంకరించడం తేలికే మరి!

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/