హిమాచల్ ప్రదేశ్ లో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలు అవ్వగా..ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీ పడుతున్నారు. 68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 55 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ సాగింది. శనివారం పోలింగ్ పర్వం జరుగుతుండగా, ఓట్ల లెక్కింపు డిసెంబరు 8వతేదీన జరగనుంది. ఈ సారి 24 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు.

హిమాచల్ లో రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా సీఎం పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ రెండు పార్టీలకు షాకివ్వాలని ఆప్ ప్రయత్నిస్తోంది. పంజాబ్ లో గెలిచిన ఊపులో ఉన్న ఆప్.. హిమాచల్ ప్రదేశ్ ను సైతం దక్కించుకోవాలని చూస్తోంది. దీంతో ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొంది. రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 8తో ముగియనుంది.