హిమాచల్ ఎన్నికలు… అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించిన బిజెపి , కాంగ్రెస్

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బిజెపి 62 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్‌ను ఆయన నియోజకవర్గమైన సెరాజ్ నుండి బరిలోకి దింపింది. నేడు ఆయన నామినేషన్లు దాఖలు చేయనున్నారు. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ 2017 ఎన్నికల్లో ఓడిపోయినందున ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. హిమాచల్ అసెంబ్లీలో ప్రస్తుతం బిజెపికి 43 మంది, కాంగ్రెస్‌కు 22 మంది సభ్యులున్నారు. ఇద్దరు స్వతంత్రులు, ఒక సీపీఎం ఎమ్మెల్యే ఉన్నారు. అక్టోబరు 17న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా, నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబరు 27న పేపర్ల పరిశీలన, ఉపసంహరణకు అక్టోబర్ 29 చివరి తేదీ.
మరోవైపు కాంగ్రెస్ 46 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను విడుదల చేసింది. 19 మంది సిట్టింగ్ ఎమ్మెల్యే లకు తొలి జాబితాలో టికెట్లు కేటాయించింది. కౌల్ సింగ్ ఠాకూర్, సుఖ్విందర్ సింగ్ సుఖు, ముఖేష్ అగ్నిహోత్రి వంటి సీనియర్ నేతలను బరిలోకి దించింది. డల్హౌసీ నుంచి ఆశా కుమారి, జవాలి నుంచి చందర్ కుమార్, దరాంగ్ నుంచి కౌల్ సింగ్ ఠాకూర్, బాల్ (ఎస్సీ) నుంచి ప్రకాశ్ చౌదరి, నాదౌన్ నుంచి సుఖ్వీందర్ సింగ్ సుఖు, హరోలీ నుంచి ముఖేష్ అగ్నిహోత్రి, అర్కీ నుంచి సంజయ్ అవస్తీ పోటీ చేయనున్నారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 12న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.