క‌ర్ణాట‌క‌లో మ‌ళ్లీ తెరుచుకున్నపాఠశాలలు..

హిజాబ్ తీసేసి లోపలికి వెళ్లిన విద్యార్థినులు

బెంగళూరు: క‌ర్ణాట‌క‌లో ప్రారంభ‌మైన హిజాబ్‌ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశమైన విష‌యం తెలిసిందే. విద్యా సంస్థల్లో విద్యార్థినులు హిజాబ్‌ ధరించడం స‌రికాదని, యూనిఫాంలో మాత్ర‌మే రావాల‌ని డిమాండ్ వ‌స్తోన్న నేప‌థ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు క‌ర్ణాట‌క‌ ప్రభుత్వం ఇటీవ‌ల ప్రకటించింది. అయితే, నేటి నుంచి మ‌ళ్లీ కర్ణాటకలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.

దీంతో మ‌ళ్లీ హిజాబ్ వివాదం ప్రారంభ‌మైంది. కొంద‌రు విద్యార్థినులు హిజాబ్‌ ధరించి పాఠ‌శాల‌లోకి వ‌స్తుండ‌డాన్ని చూసిన‌ ఓ ఉపాధ్యాయురాలు వారిని అడ్డుకుంది. దీంతో ఆ ఉపాధ్యాయురాలితో విద్యార్థినుల త‌ల్లిదండ్రులు గొడ‌వ పెట్టుకున్నారు. మాండ్యలోని రోట‌రీ స్కూల్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. పాఠ‌శాల‌లోకి అడుగు పెట్టేముందే హిజాబ్ తీసేయాల‌ని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో చివ‌ర‌కు హిజాబ్ తీసేసి విద్యార్థినులు పాఠ‌శాల‌లోకి వెళ్లారు. హిజాబ్‌తోనే పాఠ‌శాల‌లోకి అనుమ‌తించాల‌ని ఉపాధ్యాయురాలిని త‌ల్లిదండ్రులు వేడుకున్న‌ప్ప‌టికీ ఆమె వినిపించుకోలేదు. కాగా, హిజాబ్ అంశం ప్ర‌స్తుతం కోర్టు ప‌రిధిలో ఉన్న విష‌యం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/