మూడు రోజుల పాటు తెలంగాణ లో ఎండలు దంచి కొట్టనున్నాయి

తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు ఎండలు దంచి కొట్టనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి సోమవారం వరకు తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. ఈ మూడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు, జూన్ ఒకటో తేదీ నుంచి 5 రోజులపాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.

వారం క్రితం వరకు భారీ వర్షాలతో వరుణుడు ఆగం చేయగా.. ఇప్పుడు రికార్డు స్థాయి ఎండలతో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. బయట భానుడు భగభగా సెగలు పుట్టిస్తుంటే.. ఇంట్లో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఉదయం ఎనిమిది గంటల నుంచే ఎండలు మండిపోతూ.. పది దాటిందంటే మాడులు పగిలిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భానుడు భగభగలతో సెగలు కక్కుతున్నాడు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో వడదెబ్బకు గురై పలువురు మృత్యువాత పడ్డారు కూడా. ఇక ఇప్పుడు మూడు రోజుల పాటు విపరీతమైన ఎండలు కొట్టనునట్లు వాతావరణ శాఖ తెలుపడం తో ప్రజలు అలర్ట్ అవుతున్నారు.