సిఎం జగన్‌ క్రైస్తవుడు అనేందుకు ఆధారాలు ఏవి?

పిటిషనర్‌కు స్పష్టం చేసిన హైకోర్టు
ఆధారాలు లేకుండా విచారణ సాధ్యం కాదు

ap high court
ap high court

అమరావతి: ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడని చెప్పేందుకు ఆధారాలు ఉంటే కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఆదేశించారు. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ పై దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారించింది. ఎటువంటి ఆధారాలూ లేకుండా ముఖ్యమంత్రి హిందువు కాడని, క్రిస్టియన్ అని కోర్టు ముందు ఎలా వాదిస్తారని కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం, సిఎం మతానికి సంబంధించిన పూర్తి వివరాలు లేకుండా వ్యాజ్యం విచారణలో ముందుకు వెళ్లేందుకు వీలు కాదని స్పష్టం చేసింది. పిటిషనర్ అదనపు ఆధారాలను సమర్పించాలని సూచిస్తూ, తదుపరి విచారణను 22వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఇక ఇదే కేసులో గవర్నర్ ను ప్రతివాదిగా చేర్చడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ఆయన, గవర్నర్ కు వ్యతిరేకంగా ఎటువంటి అభ్యర్థనలూ కోరలేదని గుర్తు చేశారు. అటువంటి సమయంలో ఆయన్ను ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తూ, ఆయన్ను జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు.

ఇటీవల తిరుమల వెళ్లిన సిఎం జగన్‌.. స్వామి దర్శనానికి ముం దు డిక్లరేషన్‌ ఇవ్వలేదని, ఇది దేవాదాయ చట్టానికి విరుద్ధమని పేర్కొంటూ గుంటూరు జిల్లా వైకుంఠపురానికి చెందిన సుధాకర్‌బాబు హైకోర్టులో కోవారెంటో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చట్టాన్ని ఉల్లంఘించిన సిఎం జగన్‌, మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఏ అధికారంతో ఆయా పదవుల్లో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ పిటిషన్‌లో అభ్యర్థించారు. దీనిపై సోమవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా… పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాలని, కానీ జగన్‌ దీనిని పాటించలేదన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రభుత్వాధినేతే ఉల్లంఘించడం సరికాదన్నారు. ఆయన డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు వెలంపల్లి, కొడాలి వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. నిబంధనలు అమలు చేయడంలో టీటీడీ చైర్మన్‌, ఈవో విఫలమైనందున వారిని ఆ పదవుల నుంచి నిలువరించాలని కోరారు. జగన్‌ ఏ మతస్థుడన్నదానిపై ప్రజల్లోనూ సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన ఆవశ్యకత రాష్ట్ర పాలకుడి గా జగన్‌కు ఉందని వాదించారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం, టీటీడీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/