ఇంట‌ర్ బోర్డు వ‌ద్ద ఉద్రిక్త‌త‌, ప‌లువురి నేత‌ల అరెస్టు

inter board
inter board

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో  పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నడిమాండ్‌తో అఖిలపక్ష నేతలు ధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో కాంగ్రెస్, టిడిపి, తెలంగాణ జ‌న స‌మితి, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీల నేతలు పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బయలు దేరిన విపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.  హైదరాబాద్‌లోని పాతబస్తీలో కాంగ్రెస్‌ నాయకుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ను పోలీసులు గృహ నిర్భందం చేశారు.
ఇంటర్‌ బోర్డు ముట్టడికి పార్టీ నేతలతో వస్తున్న టిడిపి తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌ రమణను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మేడ్చల్‌లో డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌ను సైతం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌ పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో పలువురు కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ముందస్తుగా పలువురు నాయకులను పోలీసులు గృహనిర్భందించారు.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/