కర్నూల్ లో టెన్షన్ ..టెన్షన్

కర్నూల్ లో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు లో భాగంగా సీబీఐ అధికారులు కర్నూలు చేరుకున్నారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి గుండెపోటుతో విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకోవడం ఉత్కంఠరేపుతోంది.. తమ రాక గురించి కర్నూలు జిల్లాకు ఎస్పీకి సమాచారం ఇచ్చి , భద్రత కావాలని కోరడం జరిగింది. మరోపక్క విశ్వభారతి హాస్పటల్ లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా అవినాష్ కర్నూల్ లోనే ఉంటున్నారు.

వివేకా హత్య కేసులో భాగంగా ఈ నెల 22న విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ అవినాశ్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే తన తల్లి అనారోగ్యం దృష్ట్యా విచారణకు హాజరు కాలేనని.. మరింత సమయం కావాలని లేఖలో కోరారు అవినాష్ రెడ్డి. ఆమె కోలుకుని డిశ్ఛార్జి అయ్యే వరకు విచారణకు రాలేనని.. ఆమెను వదిలి తాను రాలేను అన్నారు. తల్లి కోలుకోవడానికి పది రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది అన్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఆసుపత్రికి చేరుకోవడం చర్చనీయాంశమైంది. తదుపరి ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం మొదలైంది.